కంచికచర్ల: సరదా.. విషాదంగా మారింది. పాఠశాలకు వెళ్లి ఇంటికి వచ్చి తన స్నేహితుడితో ఇళ్ల సమీపంలో ఉన్న కంచిలమ్మ చెరువులోకి ఆటలాడేందుకు వెళ్లిన ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. ఎస్‌ఐ విశ్వనాఽథ్ తెలిపిన వివరాల ప్రకారం కంచికచర్ల చెరువుకట్ట సమీపంలో నివసిస్తున్న వేముల నరసింహం(8) స్థానిక ఎంపీపీ(సత్రం)పాఠశాలలో నాలుగో తరగతి విద్యార్థి. శని వారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చి ఆటలాడేందుకు తన తోటి స్నేహితుడితో కలసి సమీపంలో ఉన్న కంచిలమ్మ చెరువులోకి వెళ్లారు.
అధికార పార్టీ నేతలు తవ్విన గోతుల్లో పడి..
ఇటీవల చెరువులో అధికారపార్టీ నాయకులు అక్రమంగా తవ్వకాలు జరిపిన గోతులు ఉన్నాయి. వాటిలో వర్షం నీరు చేరింది. వీటి లోతు ఎక్కువగా ఉంది. వాటిలో నరసింహం పడి మృతి చెందారు. నరసింహం వెంట వచ్చిన మరో విద్యార్థి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా భయంగా ఇంటికి వెళ్లిపోయాడు. నరసింహం తల్లిదండ్రులు తన కుమారుడు ఇంటికి రాలేదని పలు చోట్ల వెదికారు. శనివారం రాత్రి 11గంటల సమయంలో తన కుమారుడు కనిపించడం లేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఆదివారం ఉదయం చెరువుకట్టతో పాటు వారు నివసిస్తున్న ఇంటి సమీపంలో ఏర్పాటుచేసిన సీపీ కెమెరా పుటేజిలను పరిశీలించారు. ఇద్దరు విద్యార్థులు శనివారం సాయంత్రం సమయంలో చెరువులోకి వెళ్లారని గుర్తించారు. ఆ తర్వాత మరో విద్యార్థి వద్దకు వెళ్లి నరసింహం ఆచూకీ గురించి అడిగారు. కంగారుపడిన ఆ విద్యార్థి.. అతను చెరువులో పడిపోయాడని పోలీసులకు చెప్పాడు. వెంటనే అగ్నిమాపక కేంద్ర సిబ్బందితో పాటు పోలీసులు, కుటుంబసభ్యులు చెరువులోకి వెళ్లి వెతికారు. పెద్ద గోతిలోపడిన నరసింహాన్ని చూసి బయటకు తీశారు. మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. నరసింహం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేపి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కంచిలమ్మ చెరువులో పడి ఒక విద్యార్థి మృతి.. మరొకరు సురక్షితం


