ఐటీఐలో ప్రవేశాలకు అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

ఐటీఐలో ప్రవేశాలకు అడ్మిషన్లు

Aug 2 2026 1:58 AM | Updated on Aug 2 2026 1:58 AM

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): 2026––27 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు రెండవ విడత అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ఐటీఐ కౌన్సెలింగ్‌ ఎన్టీఆర్‌ జిల్లా కన్వీనర్‌ ఎం.కనకారావు ప్రకటనలో తెలిపారు. పదో తరగతితో పాటుగా 8వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ నెల 10వ తేదీలోగా ఐటీఐఅడ్మిషన్స్‌.ఏపీ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు. విజయవాడ రమేష్‌ ఆసుపత్రి రోడ్డులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో దరఖాస్తుదారుల కోసం ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల లోగా తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌ తీసుకుని పరిశీలన ప్రక్రియ పూర్తి చేయించుకోవాలని తెలియజేశారు. మరిన్ని వివరాలకు 0866–2475575 నంబరులో సంప్రదించాల్సిందిగా ఆయన కోరారు.

నవోదయ ప్రవేశపరీక్ష దరఖాస్తు గడువు పెంపు

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌: బాపులపాడు మండలం వేలేరులోని కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థ జవహర్‌ నవోదయ విద్యాలయలో 6వ తరగతి అడ్మిషన్ల కోసం నిర్వహించే జేఎన్‌వీఎస్‌ టెస్ట్‌– 2027కు దరఖాస్తు గడువును ఈ నెల 7వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లుగా ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ సి.రాజశేఖర్‌ శనివారం తెలిపారు. నవోదయ విద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించాలని ఆయన కోరారు. ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని రాజశేఖర్‌ చెప్పారు. దరఖాస్తుకు సంబంధించిన ఏదైనా సందేహాలు ఉంటే వేలేరులోని జవహర్‌ నవోదయ విద్యాలయ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

హుండీ కానుకల లెక్కింపు

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా సమర్పించిన కానుకలు, ముడుపులు, మొక్కుబడులను ఈనెల 6వ తేదీ గురువారం లెక్కించనున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. గురువారం ఉదయం 8 గంటలకు మహా మండపం ఆరో అంతస్తులో జరిగే కానుకల లెక్కింపులో సేవా సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొంటారని పేర్కొన్నారు.

ఇందుపల్లి వద్ద రైలు ఢీకొని వృద్ధుడు మృతి

ఉంగుటూరు(గన్నవరం): ఉంగుటూరు మండలం ఇందుపల్లి రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. గుడివాడ రైల్వే పోలీసుల సమాచారం ప్రకారం...ఇందుపల్లి గ్రామానికి చెందిన ఉయ్యూరు చంద్రశేఖర్‌ ప్రసాద్‌(72) మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో వేకువజామున ఇందుపల్లి రైల్వేగేట్‌ వద్ద ట్రాక్‌ దాటుతున్న అతనిని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయం ట్రాక్‌ పక్కన పడివున్న వృద్ధుడి మృతదేహాన్ని గుర్తించిన గేట్‌మెన్‌ గుడివాడ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుడివాడ ఆస్పత్రికి తరలించిన రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.

చోరీ సొత్తు స్వాధీనం

వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో గత నెలలో జరగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. కేసులో ఉన్న ముగ్గురు నిందితులను, చోరీ చేసిన నగదు, బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నట్లు వెస్ట్‌జోన్‌ ఏసీపీ ఎన్‌.దుర్గారావు తెలిపారు. ఈ సందర్భంగా వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ ప్రాంగణంలో శనివారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ దుర్గారావు సీఐ గుణరాముతో కలిసి కేసు వివరాలను వివరించారు. వివరాల్లోకి వెళితే పాతబస్తీ తారాపేటలోని శేష్‌మహాల్‌ సెంటర్‌ వద్ద వన్‌టౌన్‌కు చెందిన ప్రవీణ్‌జైన్‌ పూనం కలెక్షన్స్‌ పేరుతో వస్త్ర దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. గత నెల 23న తన ఇంటి మరమ్మతుల నిమిత్తం వ్యాపార లావాదేవీల్లో వచ్చిన రూ.22 లక్షల నగదును, 350 గ్రాముల బంగారం, వెండిని దుకాణంలో భద్రపరిచాడు. ఈ సొత్తు, బంగారం దాచి పెట్టిన విషయాన్ని దుకాణంలో పని చేస్తున్న దిలీప్‌ సింగ్‌, మింటూసింగ్‌ గమనించారు. దానిని చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు. తమకు పరిచయం ఉన్న చరణ్‌సింగ్‌, గణపతి సింగ్‌తో కలిసి వాటిని అపహరించారు. అనంతరం వారు గుజరాత్‌, అహ్మదాబాద్‌కు పరారయ్యారు. చోరీపై ప్రవీణ్‌జైన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల బంధువులు, వారి ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా వారిని గుజరాత్‌, రాజస్థాన్‌లలో ఉన్నట్లు గుర్తించారు. వన్‌టౌన్‌ పోలీసులు అక్కడకు వెళ్లి వారు ముగ్గురిని విజయవాడకు తీసుకొచ్చారు. వారిలో ఇద్దరు చోరీలో పాల్గొనగా, మిగిలిన ముగ్గురు సహకరించినట్లు గుర్తించారు. గణపతిసింగ్‌, ఇంద్రసింగ్‌ వాగెల, దిలీప్‌సింగ్‌లను అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.14.35 లక్షల నగదు, 302 గ్రాముల బంగారం, 685 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఏసీపీ దుర్గారావు తెలిపారు. కేసును ఛేదించటంలో కృషి చేసిన సిబ్బందిని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement