జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక
జిల్లా పరిషత్ సమావేశ మందిరానికి రూ.98 లక్షలతో ఆధునిక హంగులు
సమావేశ మందిరాన్ని ప్రారంభించిన
జెడ్పీ చైర్‌పర్సన్, ఇన్‌చార్జ్ కలెక్టర్
చిలకలపూడి(మచిలీపట్నం): ఎంతో మంది ఉద్దండులు జిల్లా పరిషత్ చైర్మన్లుగా పనిచేసిన ఈ స్థానంలో తాను భాగస్వామిని కావటం తన అదృష్టంగా భావిస్తున్నానని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. రూ.98 లక్షలతో ఆధునీకరించిన జెడ్పీ సమావేశ మందిరాన్ని శనివారం ఇన్‌చార్జ్ కలెక్టర్ ఎం.నవీన్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఉప్పాల హారికతో కలిసి ప్రారంభించారు. అనంతరం హారిక మాట్లాడుతూ 1962లో ఏర్పాటు చేసిన జిల్లా పరిషత్ సమావేశ మందిరానికి తిరిగి పునర్వైభవాన్ని తీసుకువచ్చేందుకు ఆధునీకరించినట్లు చెప్పారు. 25 మండలాలతో కృష్ణాజిల్లా పునర్‌వ్యవస్థీకరించిన నేపథ్యంలో పరిపాలనా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ సమావేశ మందిరాన్ని మంచి సౌకర్యాలతో రూపొందించామన్నారు. జిల్లా నుంచి దేశానికి విశిష్ట సేవలందించిన ప్రముఖుల చిత్రపటాలను సమావేశ మందిరంలో ఏర్పాటు చేసి ఈ సమావేశ మందిరానికి ప్రత్యేకతను తీసుకొచ్చామన్నారు. దీంతో పాటు జిల్లా పరిషత్ కార్యాలయంలో మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక విశ్రాంతి గదిని, చిన్నారుల సంరక్షణ కోసం చైల్డ్ కేర్ సెంటరును రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన భవనాన్ని ప్రారంభించుకున్నామన్నారు. వీటితో పాటు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ చాంబర్, సీఈవో చాంబర్‌ను కూడా ఆధునీకరించి ప్రారంభోత్సవం చేసుకున్నామన్నారు. తొలుత సమావేశ మందిరానికి సంబంధించి శిలా ఫలకాన్ని ఆవిష్కరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో నూజివీడు సబ్‌కలెక్టర్ గొల్లిపల్లి వినూత్న, అసిస్టెంట్ కలెక్టర్ నమ్రతా అగర్వాల్, జెడ్పీ సీఈవో జె.అరుణ, డెప్యూటీ సీఈవో ఆర్‌సీ ఆనంద్‌కుమార్, జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్లు గరికిపాటి శ్రీదేవి, గదిమళ్ల కృష్ణంరాజు, పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పాల్గొన్నారు.


