అంబరాన్ని తాకుతున్న సారె సంబరం | - | Sakshi
Sakshi News home page

అంబరాన్ని తాకుతున్న సారె సంబరం

Aug 2 2026 1:58 AM | Updated on Aug 2 2026 1:58 AM

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ఆషాఢ సారె సంబరాలు కొనసాగుతున్నాయి. శనివారం కూడా భక్త బృందాలు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలివచ్చి అమ్మవారికి సారెను సమర్పించాయి. సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్తులతో కొండ దిగువన కనకదుర్గనగర్‌లో పండుగ వాతావరణం నెలకొంది. అమ్మవారికి సారెను సమర్పించేందుకు విచ్చేసే భక్తులు తొలుత కనకదుర్గనగర్‌లోని బలిపీఠం అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అనంతరం మహామండపం లిఫ్టు, మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకుని మూలవిరాట్‌ను దర్శించుకుని సారెను సమర్పిస్తున్నారు. భక్త బృందాలకు మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తి వద్ద సారె సమర్పణ, ఆశీర్వచన కార్యక్రమాన్ని దేవస్థానం ఏర్పాటు చేసింది. సారె సమర్పించిన అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో సేద తీరి పసుపు, కుంకుమ, గాజులతో పాటు ఇతర పూజా సామగ్రి, మిఠాయిలను వాయినాలుగా ఇచ్చి పుచ్చుకుంటున్నారు. సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది.

నేడు ప్రొటోకాల్‌, వీఐపీ దర్శనాలు రద్దు

ఆషాఢ మాసం మూడో ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రొటోకాల్‌, వీఐపీ దర్శనాలు ఉండవని ఆలయ అధికారులు ప్రకటించారు. సామాన్య భక్తులకు పెద్ద పీట వేయాలనే భావనతో వీఐపీ దర్శనాలను, అంతరాలయ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కొండపైకి ఎటువంటి కార్లు, ఇతర వాహనాలను అనుమతించలేది లేదని, కేవలం ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తుల కోసం దేవస్థానం కొండ దిగువ నుంచి బస్సులను నడుపుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement