దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా... | - | Sakshi
Sakshi News home page

దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా...

Aug 2 2026 1:58 AM | Updated on Aug 2 2026 1:58 AM

చిలుకూరు: బైక్‌పై దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా చిలుకూరు గ్రామ పరిధిలో కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై శనివారం జరిగింది. వివరాలు...సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ మండలం బూరుగడ్డ గ్రామానికి చెందిన గడ్డం లోకేష్‌ (19) ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్‌మహ్మద్‌పేటకు చెందిన చల్లా అనిల్‌(20) దగ్గర బంధువులు. గడ్డం లోకేష్‌ షేర్‌మహ్మద్‌పేటలో అనిల్‌ ఇంట్లో ఉంటూ వైద్యశాలలో పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం వారిద్దరూ షేర్‌మహ్మద్‌పేట నుంచి బైక్‌పై సూర్యాపేట జిల్లా మఠంపల్లిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వెళ్లారు. దర్శనమైన తర్వాత తిరిగి షేర్‌మహ్మద్‌పేటకు వెళ్తుండగా...చిలుకూరు గ్రామ పరిధిలోని లారీ అసోసియేషన్‌ వద్దకు రాగానే వారి బైక్‌ వెనుక టైరుకు ఇనుప సీల గుచ్చుకుంది. దీంతో టైరు పంక్చర్‌ అయినట్లు గుర్తించి సడన్‌ బ్రేక్‌ వేయడంతో బైక్‌ ఒక్కసారిగా అదుపుతప్పి ఇద్దరూ రోడ్డుపై పడిపోయారు. ఇద్దరి తలలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు గడ్డం లోకేష్‌ తండ్రి నాగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మోహన్‌ తెలిపారు. ఘటనా స్థలాన్ని కోదాడ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు.

బైక్‌ అదుపుతప్పి రోడ్డుపై పడి

ఇద్దరు యువకులు దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement