సెంటర్ ఫర్ లిబర్టీ ప్రతినిధులు
ఏబీ వెంకటేశ్వరరావు, నల్లమోతు చక్రవర్తి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం 22ఏ బాధితులకు ఉపశమనం కల్పించేందుకు తెచ్చామని చెబుతున్న జీవో 444 ఓ చెత్త జీవో అని సెంటర్ ఫర్ లిబర్టీ కొట్టి పారేసింది. తక్షణమే 22–ఏ జాబితాను రద్దు చేసి భూములను పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. శనివారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో 22 ఏ బాధితులతో కలిసి సెంటర్ ఫర్ లిబర్టీ ప్రతినిధులు ఏబీ వెంకటేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, చక్రవర్తి మీడియా సమావేశంలో మాట్లాడారు. నిషేధిత భూముల జాబితాలో చేర్చడంతో కొన్నేళ్లుగా ఇబ్బందులు పడుతున్న రైతులు మీడియా ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా నల్లమోతు చక్రవర్తి మాట్లాడుతూ 22ఏ బాధితుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుకుంటుందోని విమర్శించారు. సీఎం చంద్రబాబు ఇనాం భూములకు విముక్తి కల్పిస్తామని అనేక సభల్లో ప్రకటించారని గుర్తు చేశారు. ఆయన చెప్పిన ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. ఆవులపల్లె జీవో మోడల్‌ను రాష్ట్రమంతటా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జీవో 444 ప్రతులను చించివేశారు. ఈ సమావేశంలో సంస్థ ప్రతినిధులు శ్రీనివాసరెడ్డి, అజయ్ మల్లారెడ్డి, రైతులు పాల్గొన్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): సమాజంలోని వివిధ రంగాల్లో రాణిస్తున్న వారికి గ్లోబల్ ఐకాన్ ఫోరమ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆగస్టు 8న అందజేయనున్న స్టేట్ ఐకాన్ అవార్డ్స్ 2026 పోస్టర్‌ను శనివారం రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రతిభను గుర్తించి గౌరవించడం ద్వారా సమాజానికి స్ఫూర్తినిచ్చే వ్యక్తులను వెలుగులోకి తీసుకురావడం ఎంతో అభినందనీయమన్నారు. కార్యక్రమంలో నిర్వాహక సంస్థ అధ్యక్షుడు జంగా చైతన్య, జనరల్ సెక్రటరీ జయాపటేరియా తదితరులు పాల్గొన్నారు.


