మున్సిపాలిటీలపైనే అప్పుల భారం
● పట్టణాల్లో మౌలిక సదుపాయాల
కల్పన నుంచి తప్పుకునేందుకు
బాబు సర్కార్ ఎత్తుగడ
● మున్సిపల్ ఆస్తులను తాకట్టు పెట్టుకుని
అభివృద్ధి పనులు చేయాలని సూచన
● జీఓ నంబర్ 151 జారీ
● లోటు బడ్జెట్‌లతో మున్సిపాలిటీలు
కార్పొరేషన్/ వార్డులు జనాభా
మున్సిపాలిటీ (అంచనా)
విజయవాడ 64 11,43,232
మచిలీపట్నం 60 2,52,000
గుడివాడ 36 1,25,000
జగ్గయ్యపేట 31 51000
పెడన 23 35,000
ఉయ్యూరు 20 42,000
నందిగామ 20 48000
తిరువూరు 28 50,000
కొండపల్లి 40 70,200
వైఎస్సార్ తాడిగడప 38 2,50,000
సాక్షి, విజయవాడ: మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనకు ఆస్తులు తాకట్టు పెట్టుకోవాలని చంద్రబాబు సర్కార్ చెబుతోంది. దీనికి ‘పూల్డ్ మున్సిపల్ బాండ్ల’ను తెరపైకి తెచ్చింది. ఇప్పటికే నగర, పట్టణాల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్య నిర్వహణ, అభివృద్ధి చేయడం ప్రభుత్వ బాధ్యత. చంద్రబాబు ప్రభుత్వం వసతుల కల్పనతో పాటు ఎంపిక చేసిన ప్రాజెక్టుల పూర్తికి మున్సిపాలిటీలు తమ పరిధిలోని విలువైన ఆస్తులను తాకట్టు పెట్టుకోవాలని చెబుతోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని ప్రజలకు కల్పించాల్సిన రోడ్లు, తాగునీరు, వీధిదీపాలు, డ్రైన్ల, పారిశుద్ధ్యం, మురుగునీటి శుద్ధి నిర్వహణ, పార్కులు వంటి మౌలిక వసతుల కల్పన, నిర్వహణ బాధ్యతల నుంచి కూడా తప్పుకునేందుకు సిద్ధమైంది. పట్టణాల్లో ప్రజలకు కనీసం అందించాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ‘పూల్డ్ మున్సిపల్ బాండ్ల’ను తెరపైకి తెచ్చింది. మున్సిపల్ ఆస్తులను పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలని చూస్తున్నారు. దీనికి ఇటీవల ప్రభుత్వం జీవో నంబర్ 151 జారీ చేసింది.
ఉమ్మడి కృష్ణా జిల్లాలో విజయవాడ కార్పొరేషన్, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు మరో 9 మున్సిపాలిటీలు ఉండగా ఇందులో విజయవాడ కార్పొరేషన్‌కు వేలసంఖ్యలో స్థిరాస్తులు(భూములు, భవనాలు, కమ్యూనిటీ హాల్స్, మార్కెట్లు, షాపులు) ఉన్నాయి. ఎలాంటి కీలక పనులు చేపట్టాలన్నా పూల్డ్ బాండ్ల ద్వారా ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకోవాల్సి ఉంటుంది.
● పూల్డ్ బాండ్ల జారీకి నగర, పట్టణ, స్థానిక సంస్థలకు క్రెడిట్ రేటింగ్ తప్పనిసరి
● ఆదాయాన్ని ఆర్జించే మున్సిపల్ ఆస్తులను ఈ బాండ్ల జారీలో అనుసంధానం చేయడం ద్వారా క్రెడిట్ ప్రొఫైల్‌ను బలోపేతం చేయాలి
పట్టణాల్లోని ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏ ప్రభుత్వమైనా ఏటా వార్షిక బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. చంద్రబాబు ప్రభుత్వం అందుకు భిన్నంగా మున్సిపాలిటీలే అప్పులు తెచ్చుకుని.. తీర్చాలని చెబుతోంది. తద్వారా ఎంపిక చేసిన విజయవాడ కార్పొరేషన్, మచిలీపట్నంతో పాటు మరో 9 మున్సిపాలిటీల్లో చేపట్టాల్సిన పనులను ఇప్పటికే గుర్తించారు. బాండ్ల ద్వారా వచ్చిన నిధులతో మున్సిపాలిటీల్లో చేపట్టే ప్రాజెక్టులతో వచ్చే రాబడి కంటే, ఆ బాండ్లకు చెల్లించాల్సిన వడ్డీ భారమే ఎక్కువ ఉంటుంది. భవిష్యత్తులో ఏదైనా ప్రాజెక్టు విఫలమై బాండ్ల చెల్లింపులకు నిధులు సరిపోకపోతే, ఆ భారమంతా మున్సిపాలిటీలపైనే పడుతుంది.


