గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నిషేధిత భూముల (22–ఏ) జాబితాలో పొరపాటున నమోదైన భూములకు సంబంధించి పట్టాదారులకు విముక్తి కల్పించినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతి దరఖాస్తును పారదర్శకంగా, చట్టబద్ధంగా, వేగవంతంగా పరిశీలిస్తూ 22(ఏ) కేసుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణలు నిర్వహించి, చట్టబద్ధంగా అర్హత ఉన్న భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ యాజమాన్య హక్కులను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 22(ఏ) కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో ఇప్పటికే 72 కేసులను పరిష్కరించి 282 ఎకరాల భూమికి 22(ఏ) జాబితా నుంచి విముక్తి కల్పించామన్నారు. 2024లో నాలుగు కేసులకు సంబంధించి 8.95 ఎకరాలు, 2025లో 19 కేసులకు సంబంధించి 105.55 ఎకరాలు, 2026లో ఇప్పటివరకు 49 కేసులకు సంబంధించి 167.91 ఎకరాలకు నిషేధిత జాబితా నుంచి విముక్తి కల్పించినట్లు తెలిపారు. వీటిలో అయిదు నుంచి 15ఏళ్ల పాటు సైతం అపరిష్కృతంగా ఉన్నవి కూడా ఉన్నాయన్నారు.
దుర్గమ్మకు బంగారు హారం సమర్పణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు గుంటూరుకు చెందిన భక్తుడు మంగళవారం రూ. 3 లక్షల విలువైన బంగారు హారాన్ని కానుకగా సమర్పించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం హరిచంద్రపురానికి చెందిన సీహెచ్ వంశీకృష్ణ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి సుమారు 20 గ్రాముల బంగారంతో తయారు చేయించిన హారాన్ని అందజేశారు. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరంవేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా.. ఆలయ అధికారి డీవివి సత్యనారాయణ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందించారు.
డాక్టర్ జవ్వాజి లోకేష్‌కు గోల్డ్‌మెడల్ ప్రదానం
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో జనరల్ సర్జరీ విభాగంలో ఉత్తమ అవుట్‌గోయింగ్ పోస్టు గాడ్యుయేల్ విద్యార్థిగా ఎంపికై న డాక్టర్ జవ్వాజీ లోకేష్‌కు సోమవారం డాక్టర్ కనకమేడల శ్రీనివాస్ స్మారక గోల్డ్‌మెడల్‌ను అందజేశారు. వైద్య కళాశాల సెమినార్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు డాక్టర్ ఎ విష్ణువర్థన్, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం వీసీ డాక్టర్ పులాల చంద్రశేఖర్ చేతుల మీదగా ఈ మెడల్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు మాట్లాడుతూ జనరల్ సర్జరీలో ఉత్తమ అవుట్‌గోయింగ్ విద్యార్థికి డాక్టర్ కనకమేడల శ్రీనివాస్ స్మారకార్థం ఆయన పుట్టిన రోజు అయిన జూలై 14న ఏటా ఈ గోల్డ్‌మెడల్ అందిస్తున్నట్లు తెలిపారు. జీజీహెడ్ సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్, జనరల్ సర్జరీ హెచ్‌ఓడీ డాక్టర్ పద్మశ్రీ, కళాశాల పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ప్రతినిధులు, మెడల్ గ్రహీత తల్లిదండ్రులు పాల్గొన్నారు.
వైద్య శాఖలో సమస్యలు పరిష్కరించాలని వినతి
మధురానగర్(విజయవాడ సెంట్రల్): రాష్ట్రపతి ఉత్తర్వులు 2025 అమల్లో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖలో ఏర్పడే ఇబ్బందులను తక్షణమే పరిష్కరించాలని, నిలిచిన సీహెచ్‌వో, ఇతర కేడర్ ఉద్యోగోన్నతులు పూర్తిచేయాలని ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గొంతి ఆస్కార్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆ శాఖ కార్యదర్శి వీరపాండియన్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. అందులో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగుల ఇబ్బందులు, సమస్యలను వివరించారు. కార్యక్రమంలో సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ సాగర్, నాయకులు సత్యనారాయణ, సత్యనారాయణ బాబు, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.


