గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) గడువు ఎట్టకేలకు పొడిగించారు. ఈనెల 24వ తేదీ వరకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, పూర్తి చేయడం, వాటిని తిరిగి తీసుకోవడం, ఆ పై డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ కొనసాగనుంది. నెల రోజుల ప్రక్రియలో బీఎల్వోల మెడపై కత్తి పెట్టి అధికారులు హడావుడి చేశారు. ఫలితంగా ఫారాల పంపిణీ పూర్తి కాకుండానే నూరు శాతం పూర్తి చేసినట్లు గణాంకాలు చూపారు. క్షేత్రస్థాయి పరిస్థితులు భిన్నంగా ఉండడంతో రాజకీయ పక్షాలు, ప్రజాస్వామిక వాదులు, పలు రకాల సంస్థలు సర్ ప్రక్రియ గడువు పెంచాలని డిమాండ్ చేశాయి.
లోపాలు సరిచేస్తారా?
నెల రోజుల పాటు జరిగిన ప్రత్యేక సమగ్ర సవరణ కొంత లోపభూయిష్టంగా సాగింది. బీఎల్వోలు ఒక పర్యాయం కూడా ఇంటింటికీ వెళ్లని పరిస్థితి ఉంది. ఏదో ఒక ప్రదేశంలో కూర్చొని బీఎల్‌ఏలకు ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చి పంపిన సందర్భాలు ఉన్నాయి. అసలు ఫారాలే పంపిణీ చేయకపోవడం, వాటిని పూర్తి చేయడంలో సహకరించకపోవడం, కొందరికి రెండు ఫారాలు ఇవ్వకపోవడం, ఇవ్వకుండానే ఇచ్చినట్లు అధికారిక గణాంకాలు చూపారు. కొందరు ఇంకొక అడుగు ముందుకు వేసి అసలు ఫారాలే ఇవ్వకుండా డిజిటలైజేషన్ చేసేశామని ఓటర్లకు చెప్పారు. తొలుత సర్‌ను తేలికగా తీసుకున్న అధికార గణం.. గడువు దగ్గరపడుతుండటం, ఒత్తిడి పెరగడంతో రకరకాల ప్రయత్నాలు చేసి డిజిటలైజేషన్ శాతం పెంచుతూ వచ్చారు.
గందరగోళం..
విజయవాడ లాంటి నగరంలో ఓటర్లు తరచూ ఇళ్లు మారడం, అద్దె ఇళ్లలో నివసించే నగరంలోనే ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి ఫోన్ నంబర్లు లేకపోవడం, వృత్తిరీత్యా ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి వచ్చి గతంలో ఓటర్లుగా నమోదు చేసుకున్న వారి వివరాలు ఇతమిద్ధంగా తెలియకపోవడంతో వాటిని పాక్షికంగా బదిలీ, పూర్తిగా వలస వెళ్లిన జాబితాలో చేర్చాలో తెలియని గందర గోళ పరిస్థితి నెలకొంది. గతంలో ఏ బూత్‌లో ఏ డోర్ నంబరులో నివసించారో ఆ ఇంటి ఓనర్లు అద్దెకున్న వారి సమాచారం ఇవ్వకపోవడం జరిగింది. 2024 ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో పోలింగ్ శాతానికి మించి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినందున నూరు శాతం అయినట్లు చూపారని అధికారుల్లోనే ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ గడువు పొడిగించినందున ఎక్కడెక్కడ ఏయే నియోజకవర్గాల్లో ఏయే బూత్‌లలో వాస్తవంగా ఫారాలు పంపిణీ చేయలేదో.. డిజిటలైజేషన్ చేయలేదో గుర్తించి ఈ గడువు ముగిసేలోపు సరిచేయాలని రాజకీయ పక్షాలు కోరుతున్నాయి. అలాగే 2002 ఓటర్ల జాబితాలో వివరాలు లభ్యం కాని వారిపై ప్రత్యేక దృష్టి వారికి కావాల్సిన సర్టిఫికెట్లు అందజేయడం, ప్రక్రియను పూర్తి చేయాలని కోరుతున్నారు. అటువంటి వారిని గుర్తించి ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
అవగాహన పెంచుకోవాలి..
ఎన్నికల సంఘం గడువు పెంచి మరో అవకాశం ఇచ్చింది. ఓటర్లు సర్‌పై మరింత అవగాహన పెంచుకుని ఈ ప్రక్రియలో పాల్గొని ఓటు హక్కును కాపాడుకోవాలి. సర్ ఆవశ్యకతను తెలుసుకుని బీఎల్ ఓలకు సహకరించడం, వారి నుంచి ఫారాలు తీసుకొని, వాటిని నింపి ఇస్తే ఓటు భద్రంగా ఉంటుంది.
24 వరకు గడువు పెంచిన ఎన్నికల సంఘం


