సీపీ రాజశేఖరబాబు
మహిళా భద్రతకు పోలీస్ వ్యవస్థ ప్రాధాన్యం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): మహిళల భద్రతకు పోలీస్ వ్యవస్థ ప్రాధాన్యమిస్తోందని విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు చెప్పారు. స్థానిక సిద్ధార్థ ఆడిటోరియంలో తరుణీతరంగాలు సంస్థ ఆధ్వర్యాన జరుగుతున్న 6వ మహిళా ఫెస్ట్ ముగింపు సభ గురువారం జరిగింది. ఈ సందర్భంగా ప్రస్తుతం సమాజంలో నేరాలు చాలా ఆందోళనకరంగా ఉంటున్నాయని వీటిని నివారించడానికి వివిధ పద్ధతుల్లో పోలీస్ వ్యవస్థ పనిచేస్తోందన్నారు. మహిళల కంటే పురుషుల్లో ఆత్మహత్యల శాతం ఎక్కువగా ఉందని, అందుకు ప్రధాన కారణం ఆర్థిక సమస్యలు, జీవిత భాగస్వామితో విభేదాల కారణంగా జీవితాలను చాలించడం ఆందోళనకరంగా ఉందన్నారు. తరుణీ తరంగాలు ఉపాధ్యక్షురాలు ఎన్.విద్యాకన్నా మాట్లాడుతూ రాజకీయాలు, అంతరిక్ష రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారని ఇది మహిళాభివృద్ధికి సంకేతమని చెప్పారు. సిద్ధార్థ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత మాట్లాడుతూ సాంస్కృతిక ప్రదర్శనలతో మహిళల్లో సృజనాత్మకత పెరగడంతో పాటుగా మానసికోల్లాసం కలుగుతుందన్నారు. ఒకప్పుడు విద్యాసంస్థల్లో విద్యార్థినుల శాతం చాలా తక్కువగా ఉండేదని ప్రస్తుతం 70 శాతాని కంటే ఎక్కువగానే విద్యార్థినులు హాజరవుతున్నారన్నారు. సభ అనంతరం మహిళలకు, విద్యార్థినులకు నిర్వహించిన వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. తరుణీ తరంగాలు సంస్థ అధ్యక్ష కార్యదర్శులు రావి శారద, డి.రమాదేవి, సభ్యులు వి.శ్రీదేవి, ఉషారాజా, ఉషారాణి, అనీషా, సరోజ, కామేశ్వరి పాల్గొన్నారు.


