లూయిస్ బ్రెయిలీ సేవలు చిరస్మరణీయం
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): లూయిస్ బ్రెయిలీ సేవలు చిరస్మరణీయమైనవని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. నగరంలో ఎంజీ రోడ్డులోని ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో గురువారం జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం జరిగింది. విభిన్న ప్రతిభావంతులు, అధికారులు, చిన్నారులతో కలిసి లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ నేత్ర సమస్యలు ఉన్నాయని కలత చెందొద్దన్నారు. బ్రెయిలీ చూపిన మార్గంలో నడిచి ఎవరికీ తక్కువ కాదని నిరూపించాలన్నారు. అపుడే బ్రెయిలీకి నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కలెక్టర్.. బ్రెయిలీ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 3న నిర్వహించిన విభిన్న ప్రతిభావంతుల ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన దివ్యాంగ ఉద్యోగులకు మెరిట్ అవార్డులు అందించారు. విజయవాడలో లూయీస్ బ్రెయిలీ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని వివిధ సంఘాల ప్రతినిధులు కోరగా ఈ అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సహాయ సంస్థ చైర్‌పర్సన్ జి.నారాయణస్వామి మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని బాగా చదువుకునేందుకు అవసరమైన ఉపకరణాలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వాడ్రేవు కామరాజు, ఠాగూరు గ్రంథాలయ అధికారి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.


