సాహితీ విమర్శకు ఉత్తమ సాహిత్యమే లక్ష్యం
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): సాహితీ విమర్శకు ఉత్తమ సాహిత్యమే లక్ష్యం కావాలని సాహితీ విమర్శకులు రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అన్నారు. విజయవాడ బుక్ పెస్టివల్ సొసైటీ ఆధ్వర్యాన జరుగుతున్న విజయవాడ పుస్తక మహోత్సవంలో ఏడో రోజు గురువారం బీవీ పట్టాభిరామ్ సాహిత్య వేదికపై ‘పాతికేళ్ల సాహిత్య విమర్శ’ పై సదస్సును నిర్వహించారు. ముఖ్యవక్త చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ సమాజమూ, సాహిత్యమూ, సాహిత్య విమర్శ పరస్పర ఆధారితాలన్నారు. తెలుగులో సాహిత్య విమర్శ పేరుతో ప్రచురిస్తున్నవన్నీ నిజమైన విమర్శలు కాకపోవడం దురదృష్టకరమన్నారు. పాతికేళ్లలో తెలుగులో దాదాపుగా 500 సాహిత్య విమర్శగ్రంథాలు వచ్చాయన్నారు. సీనియర్ పాత్రికేయులు తెలకపల్లి రవి మాట్లాడుతూ సాధారణంగా విమర్శను అర్థం చేసుకోవడం, అందులోనూ సాహిత్య విమర్శను అర్థం చేసుకోవడం అంత తేలిక కాదన్నారు. సాహితీ విమర్శ సాహిత్యానికి చాలా అవసరమన్నారు. సాహితీవేత్త గుంటూరు లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ పాతికేళ్లలో ప్రాంతీయ, అస్తిత్వ స్పృహతో వచ్చిన విమర్శలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ప్రాంతీయ స్పృహతో విమర్శించడం సాహిత్య విమర్శలో కొత్తకోణమన్నారు. పుస్తక మహోత్సవ సంఘ అధ్యక్షుడు మనోహర్ నాయుడు గోష్ఠికి స్వాగతం పలికారు. సభకు చినుకు పత్రిక సంపాదకుడు నండూరి రాజగోపాల్ అధ్యక్షత వహించారు.
విలువలను తట్టిలేపిన మునిపల్లె రాజు కథలు
మానవీయ విలువలను తట్టిలేపేందుకు కథలను సాధనంగా వాడుకున్న చక్కని కథారచయిత మునిపల్లె రాజు అని రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మి అన్నారు. పుస్తక మహోత్సవంలో భాగంగా సాహిత్య వేదికపై సాహితీవేత్త మునిపల్లె రాజు శతజయంతి సభ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కథారచనాపరంగా మునిపల్లె రాజు సంప్రదాయ అభిమాని అయినా వాటిలోని మూలాలను అర్థం చేసుకుని మూఢాచారాలకు వ్యతిరేకించాడన్నారు. ఆయన రాసిన 70 కథల్లో సామాన్య మానవుల గుండెచప్పుడు వినిపిస్తుందన్నారు. సభాధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మునిపల్లె రాజు తెలుగు సాహిత్యంపై తనదైన ముద్ర వేసిన కథారచయిత అని చెప్పారు. సాహితీ సంపాదకులు కాట్రగడ్డ దయానంద్, కొప్పర్తి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రశ్నిస్తే రౌడీషీట్‌లు తెరుస్తున్నారు
ప్రస్తుత పాలకులు తమ వైఫల్యాలను ప్రశ్నిస్తే వారిపై రౌడీషీట్‌లు తెరుస్తున్నారని విశాలాంధ్ర విజ్ఞాన సమితి జనరల్ మేనేజర్ హరనాథ్‌రెడ్డి అన్నారు. ఇటీవల మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తున్న తీరును విమర్శిస్తే వారిపై కేసులు పెడుతున్న సంఘటనలను ఉదహరించారు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ ముద్రించిన పలు గ్రంథాలను విజయవాడ పుస్తక మహోత్సవం ప్రాంగణంలో గురువారం ఆవిష్కరించారు. ఆర్వీ రామారావు రాసిన ‘శతవసంతాల అరుణ పథం’ను, డాక్టర్ దేవరాజు మహారాజు రాసిన ‘మానవ చరిత్ర ఎక్కడ ప్రారంభమైంది?, ‘సైన్స్‌కు దేశంలో గడ్డుకాలం’, పుస్తకాలను, నికొలై ఇవనోవ్ రాసిన ‘కార్ల్ మార్క్స్ జీవిత సంగ్రహం’లను అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. సభకు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సంపాదకులు గడ్డం కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ప్రజాశక్తి దినపత్రిక పూర్వ సంపాదకులు ఎంవీఎస్ శర్మ, ఏఎన్‌యూ విశ్రాంత ఆచార్యులు ఆచార్య సీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
సినీరంగంలో విజయంతో మర్యాద
సినిమా రంగంలో సక్సెస్ అయినప్పుడే మర్యాద లభిస్తుందని లేకపోతే పట్టించుకునే వారు ఉండరని రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. పుస్తక మహోత్సవంలో భాగంగా యండమూరి వీరేంద్రనాథ్, సినీ దర్శకుడు కోదండరామిరెడ్డి సినీ అనుభవాల జుగల్బందీ కార్యక్రమాన్ని గురువారం రాత్రి పట్టాభిరామ్ సాహితీవేదికపై నిర్వహించారు. తొలుత యండమూరి, కోదండరామిరెడ్డి కలసి తీసిన అభిలాష తదితర సినిమాల అనుభవాలను శ్రోతలతో పంచుకున్నారు.
సాహితీ విమర్శకు ఉత్తమ సాహిత్యమే లక్ష్యం


