ఆదాయ వృద్ధి లక్ష్యాలపై దృష్టి
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏడాది కాలంలో సమష్టి కృషితో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నామని.. ఈ ప్రగతి పథం స్ఫూర్తిగా జిల్లా సమగ్రాభివృద్ధికి ముందడుగు వేద్దామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మంగళవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్రతో కలిసి కలెక్టర్ కీలక ప్రగతి సూచికల(కేపీఐ)తో పాటు జిల్లా అభివృద్ధికి, ప్రజల క్షేమం, సంక్షేమానికి ఏడాది కాలంగా చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలు, సాధించిన విజయాలు, వాటి స్ఫూర్తితో కొత్త ఏడాది కార్యాచరణపై సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ 12 నెలల కాలంలో మైలురాళ్లను గుర్తుకు తెస్తూ వచ్చే ఏడాదిలో స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. కేపీఐలో రాష్ట్రంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. కొత్త ఏడాదిలోనూ జీడీడీపీ, జీవీఏ, తలసరి ఆదాయం వంటి ఆర్థిక సూచికల్లోనూ లక్ష్యాలను చేరుకునేందుకు కృషిచేద్దామని కలెక్టర్ పిలుపునిచ్చారు.
కీలక ప్రగతి సూచికల్లో ఏ+ లక్ష్యం..
ప్రతి కీలక ప్రగతి సూచికలో (కేపీఐ)లో ఏ+ గ్రేడ్ మన లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు. సాధించిన స్కోరు ప్రకారం నవంబర్ వరకు చూస్తే ఎ.కొండూరు మండలం 129 సూచికల్లో 92 స్కోరు, నందిగామ 136 సూచికల్లో 90, తిరువూరు 124 సూచికల్లో ఏ ప్లస్ గ్రేడ్ సాధించాయని తెలిపారు. ప్రతి మండలం, ప్రతి సూచికలోనూ ఏ ప్లస్ గ్రేడ్‌ను చేరుకునేందుకు మరింత కృషిచేయాలని సూచించారు. సమావేశంలో సీపీవో వై.శ్రీలత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


