ఈ–ఆటోలతో చెత్త సేకరణ
చిలకలపూడి(మచిలీపట్నం): గ్రామాల్లో చెత్త సేకరణకు వివిధ రంగుల చెత్త బుట్టలతో ఈ–ఆటోలు, తోపుడు బండ్లను ఏర్పాటు చేశామని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ఆవరణలో సోమవారం జిల్లా పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యాన చెత్తసేకరణ కోసం ఈ–ఆటోలు, తోపుడు బండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా ఆయన ఈ–ఆటోలను నడిపారు.
అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. ఇందుకోసం జిల్లాలో ఎనిమిది ఈ–ఆటోలు, 171 తోపుడు బండ్లను గ్రామాలకు అందజేశామన్నారు. ఆటోలు, తోపుడుబండ్లలో వేర్వేరు రంగులతో చెత్తబుట్టలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో జె.అరుణ, డీఎల్‌పీవో రహ్మతుల్లా, ఏవో సీతారామయ్య, పలువురు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


