దుర్గమ్మ భక్తుల తలనీలాలకు రికార్డు ధర
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు సమర్పించిన తలనీలాలకు రికార్డు ధర పలికాయి. ఏడాదికి రూ. 10.10 కోట్లకు తణుకుకు చెందిన ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్ టెండర్‌ను దక్కించుకుంది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని మహా మండపం ఆరో అంతస్తులో సోమవారం టెండర్ ప్రక్రియను నిర్వహించారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో పాటు ఏపీకి చెందిన మొత్తం 19 మంది కాంట్రాక్టర్లు ఒక్కొక్కరూ రూ.50 లక్షల ప్రథమ దరావత్తుగా చెల్లించి వేలంలో పాల్గొన్నారు. రెండేళ్ల కాల పరిమితికి దేవస్థానం టెండర్లు ఆహ్వానించగా, కాంట్రాక్టర్ మొదటి ఏడాది మొత్తంపై 10 శాతం పెంపుతో రెండో ఏడాది టెండర్ కొనసాగింపు జరుగుతుందని టెండర్ నిబంధనల్లో పొందుపరిచారు. గతంలో రూ. 8 కోట్ల పైబడి పలికిన టెండర్ రెండేళ్ల హెయిర్‌కు డిమాండ్ లేకపోవడంతో కేవలం రూ. 6.30 కోట్లకు కాంట్రాక్టర్‌కు దేవస్థానం అప్పగించింది. ఈ ఏడాది మళ్లీ హెయిర్‌కు డిమాండ్ రావడంతో అధిక ధర పలకడం గమనార్హం.
మూడు విధానాల్లో..
బహిరంగ వేలం, సీల్డ్ టెండర్, ఈ టెండర్ వంటి మూడు విధానాల ద్వారా దేవస్థానం టెండర్లు ఆహ్వానించారు. మూడు రాష్ట్రాలకు చెందిన మొత్తం 19 మంది టెండర్లు దాఖలు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 6.30 కోట్లు పలికిన టెండర్‌కు 2026 జనవరితో కాంట్రాక్ట్ ముగుస్తుంది. ఫిబ్రవరి 1 నుంచి తలనీలాలు పొగు చేసుకునేలా నిర్ణయించిన ఆలయ అధికారులు పాటను రూ. 7 కోట్లుగా నిర్ణయించి బహిరంగ వేలం ప్రారంభించారు. మదర్ హ్యూమన్ హెయిర్ ఇండస్ట్రీస్, ఇండియన్ హెయిర్ ఇండ్రస్టీస్ టెండర్‌ను దక్కించుకునేందుకు పోటీ పడ్డాయి. చివరకు ఇండియన్ హెయిర్ ఇండ్రస్టీస్ రూ. 10.10 కోట్లకు బహిరంగ వేలం ద్వారా టెండర్‌ను దక్కించుకుంది.
సీల్డ్ టెండర్‌లో నలుగురు కాంట్రాక్టర్లు
సీల్డ్ టెండర్‌లో నలుగురు కాంట్రాక్టర్లు టెండర్లు దాఖలు చేయగా, అందులో అత్యధికంగా రూ. 9.57 కోట్లకు కోట్ చేశారు. ఆన్‌లైన్‌లో ఈ టెండర్ ద్వారా రూ. 9.09 కోట్లకు టెండర్ దాఖలు చేయడంతో బహిరంగ వేలం ద్వారా అత్యధిక ధర పలకడంతో ఆ టెండర్‌ను ఆమోదిస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. టెండర్ ప్రక్రియను ఈవో శీనానాయక్, ఎసీ రంగారావు, ఏఈవోలు చంద్రశేఖర్, ఎన్.రమేష్‌బాబు, సూపరింటెం డెంట్లు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పర్యవేక్షించారు. కమిషనర్ అనుమతి అనంతరం టెండరు ఖరారు చేస్తారని అధికారులు పేర్కొన్నారు.


