పెరిగిన ఆర్థిక, నార్కోటిక్ నేరాలు
టెక్నాలజీతో నేర నియంత్రణ..
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఎన్టీఆర్ జిల్లాలో గత ఏడాది కంటే 2025లో ఆర్థిక నేరాలతో పాటు, నార్కోటిక్ కేసులు కూడా పెరిగాయి. కాగా ఈ ఏడాది హత్యలు కొద్దిగా తగ్గగా, అదే రీతిలో హత్యాయత్నాలు పెరిగాయి. కిడ్నాప్‌లు, రోడ్డు ప్రమాదాలు, దోపిడీలు, దొంగతనాలు, సైబర్ నేరాలు కాస్త తగ్గినట్లు జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్‌వీ రాజశేఖరబాబు తెలిపారు. మొత్తంగా 2024లో 11,977 నేరాలు జరగ్గా, 2025లో 9,503 జరిగినట్లు చెప్పారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మంగళ వారం నిర్వహించిన మీడియా సమావేశంలో నేర నివేదిక–2025 వివరాలు వెల్లడించారు.
ఆర్థిక నేరాలు పెరగ్గా, ఇతర నేరాలు తగ్గాయి..
జిల్లాలో ఆర్థిక నేరాలు 2024 కంటే 2025లో 12.68 శాతం పెరగ్గా, నార్కోటిక్స్ కేసులు 19.57 శాతం పెరిగాయి. కాగా ఆస్తి నేరాలు 39.83 శాతం, శారీరక నేరాలు(హత్యలు, హత్యాయత్నాలు) 12.53శాతం, మహిళా నేరాలు 15.11శాతం, పోక్సో కేసులు 23.64 శాతం, రోడ్డు ప్రమాదాలు 23.39 శాతం తగ్గినట్లు క్రైమ్ నివేదికలో వెల్లడించారు. కాగా సైబర్ క్రైమ్ కూడా 45.05 శాతం తగ్గినట్లు క్రైమ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇళ్ల తాళాలు పగలగొట్టిన నేరాలు స్వల్పస్థాయిలో తగ్గగా, సాధారణ నేరాలు బాగా తగ్గినట్లు పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల్లో 366 మంది మృతి చెందగా, వారిలో ద్విచక్రవాహనదారులు 209 మంది, పాదచారులు 107 మంది ఉన్నారు.
విజయవంతమైన కేసులు..
గుర్తుతెలియని వాహనాలు ఢీకొని మరణించిన, తీవ్రగాయాలైన వారికి హిట్ అండ్ రన్ నిధి ద్వారా రూ.2కోట్ల మేర కుటుంబ సభ్యులకు పరిహారం అందించామని సీపీ తెలిపారు. సైబర్ నేరస్తులు దోపిడీ చేసిన డబ్బును రూ.9.54కోట్లు సీజ్ చేసి, తిరిగి బాధితులకు అందించామన్నారు. నేరాల నియంత్రణలో భాగంగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ఏబీసీడీ అవార్డును అందుకున్నా మని చెప్పారు. సెల్‌ఫోన్‌లు చోరీ కేసుల్లో వంద శాతం రికవరీ చేసి 271 ఐఫోన్‌లను బాధితులకు అప్పగించామన్నారు. అంతర్రాష్ట్ర శిశు విక్రయాలను ఛేదించి 10మంది నిందితులను అరెస్టు చేసినట్లు సీపీ వివరించారు. దసరా ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడం, నక్సల్స్‌ను అదుపులోకి తీసుకోవడం వంటి అనేకం ఉన్నట్లు తెలిపారు. డీసీపీలు కృష్ణకాంత్ పటేల్, కేజీవీ సరిత, షిరీన్‌బేగం, కృష్ణప్రసన్న, ఏబీటీఎస్ ఉదయరాణి, తిరుమలేశ్వరరెడ్డి, లక్ష్మీనారాయణ, ఎస్‌వీడీ ప్రసాద్‌తో పాటు ఏడీసీపీలు యం రాజారావు, గుణ్ణం రామకృష్ణ, కె కోటేశ్వరరావు,అన్ని డివిజన్‌ల ఏసీపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్షిక క్రైమ్ రిపోర్టులు సీపీ రాజశేఖరబాబు ఆవిష్కరించారు.
సైబర్ క్రైం కేసుల్లో నగదు
వెనక్కి తీసుకొస్తున్నాం
నేరాల నియంత్రణకు అత్యాధునిక
టెక్నాలజీ వినియోగం
రోడ్డు ప్రమాద మృతుల్లో పాదచారులు,
ద్విచక్ర వాహనదారులే అధికం
నే ర నివేదిక–2025ను
విడుదల చేసిన సీపీ రాజశేఖరబాబు
సురక్ష 360 కార్యక్రమం ద్వారా విజయవాడ నగరంలోని కాలనీలతో పాటు, జిల్లాలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. దాదాపు 10వేల సీసీ కెమెరాల ద్వారా నిరంతరం మానిటరింగ్ చేస్తూ, క్రైం నియంత్రణ, నిందితుల గుర్తింపు వంటి వాటితో సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. డ్రోన్స్ సర్వేలెన్స్ ద్వారా ట్రాఫిక్ నియంత్రణతో పాటు, నేరాలు అదుపు చేస్తున్నామన్నారు. క్లౌడ్ పెట్రోలింగ్, అస్త్రం యాప్‌లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, నేరస్తులను గుర్తించేందుకు ఎఫ్‌ఆర్‌ఎస్ సిస్టమ్ వంటివి అమలు చేస్తున్నాం. ఇలా సాంకేతికత వినియోగంలో రాష్ట్రంలోనే ముందున్నట్లు తెలిపారు.


