న్యూస్‌రీల్
ఎన్టీఆర్ జిల్లాను నిండా ముంచిన వర్షాలు భారీ వర్షాలకు పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు పలు ప్రాంతాల్లో దెబ్బతిన్నపత్తి, మొక్కజొన్న, వరి పైర్లు కోతకు గురైన రహదారులు.. కొట్టుకుపోయిన కల్వర్టులు
ఎన్టీఆర్ జిల్లా
శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025
స్వాతంత్య్ర దినోత్సవ సందడి
వాడవాడలా స్వాతంత్య్ర దినోత్సవ సందడి నెలకొంది. విజయవాడ నగరంతోపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ పతాకాల విక్రయాలు జోరుగా సాగాయి.
దుర్గమ్మకు పలువురి విరాళాలు
విజయవాడ దుర్గమ్మకు గురువారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. నిత్యాన్నదానం పథకం కోసం ఈ విరాళాలు ఆలయ అధికారులకు అందజేశారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లాను భారీ వర్షం నిండా ముంచింది. నిన్నటి వరకూ నీటి తడుల కోసం ఎదురుచూసిన పొలాలు ఇప్పుడు ముంపు బారినపడి రైతులకు కన్నీరు మిగిల్చాయి. పలు చోట్ల రోడ్లు ధ్వంసం కావడంతో గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. మంగళ వారం 58.96 మిల్లీమీటర్లు, బుధవారం 94.05 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఈ భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతు న్నాయి. తెలంగాణ నుంచి ఆంధ్రలోకి ప్రవహించే పాలేరు, మున్నేరు, వైరా, కట్టలేరు, బుడమేరు వంటి వాగులు వరదతో పోటెత్తాయి. నందిగామ, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లోని ఏనుగుగడ్డ వాగు, పులివాగు, నక్కవాగు, వెదుళ్ల వాగు, కొండవాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా పంట పొలాలు నీట మునిగాయి. పల్లపు ప్రాంతాల భూముల్లో సాగు చేసిన పత్తి పత్తిచేలు నల్లగామారి గొడుగులెత్తాయి. వాగుల కింద వరి నారుమడులు దెబ్బతిన్నాయి. నాట్లు వేసిన ప్రాంతాల్లో వరి పైరు పూర్తిగా మునిగింది. పలు రహదారులు ధ్వంసమయ్యాయి. గ్రామాలకు వెళ్లే రోడ్లు భారీ కోతకు గుర య్యాయి. ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్ద విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారిపై గురువారం కూడా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
తిరువూరు నియోజకవర్గంలో..
గంపలగూడెం – విజయవాడ రహదారిలో తోటమూల – వినగడప మధ్య కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. గతంలో ఇక్కడ నిర్మించిన కాజ్‌వే కొట్టుకుపోయింది. ఆ పక్కనే ప్రత్యామ్నాయంగా రోడ్డు నిర్మించారు. భారీ వర్షాలకు కట్టలేరు ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో ఈ రోడ్డులో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరి, పత్తి పొలాలు దెబ్బతిన్నాయి. చౌటపల్లి వెదుళ్ల వాగు, అక్కపాలెం పడమటి వాగు ఉప్పొంగడంతో వరి, పత్తి పైర్లకు నష్టం వాటిల్లింది.
మైలవరం నియోజకవర్గంలో..
కృష్ణానదికి ఎగువ నుంచి భారీగా వరద రావడంతో ఇబ్రహీంపట్నంలోని పలు గ్రామాల్లోకి నీరు చేరింది. ఏనుగుగడ్డ వాగు పొంగడంతో దాములూరు, కొత్తపేట, ఆత్కూరు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. జూపూడి వద్ద జాతీయ రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. బుడమేరులో సుమారు వెయ్యి క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. జి.కొండూరు మండలం వెలగలేరు సమీపంలో బుడమేరు హెడ్ రెగ్యులేటర్ వద్ద రెండు అడుగుల మేర వర్షం నీరు నిలిచి ఉంది.
నందిగామ నియోజకవర్గంలో..
కంచికచర్ల మండలం చెవిటికల్లు వద్ద లక్ష్మయ్య వాగు పొంగడంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది. కీసర వద్ద మున్నేరుకు 390 క్యూసెక్కుల వరద వస్తోంది. జాతీయ రహదారి పక్కనే ఉన్న కంచికచర్ల బస్ స్టేషన్ నీట మునిగింది. వీరులపాడు మండలం పల్లంపల్లి, నందిగామ మండలం దామూలూరు గ్రామాల మధ్య కూడలి వద్ద కట్టలేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. అటుగా రాకపోకలు నిలిపివేశారు. మండలంలోని ఏటిపట్టు గ్రామాల్లో పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. నందిగామ, చందాపురం మధ్య వాగు, ముప్పాళ్ల వద్ద నల్లవాగు, పాటెంపాడు వద్ద గుర్రాల వాగు పొంగాయి.
విజయవాడ నగరంలో...
నగరంలోని మూడు నియోజకవర్గాల్లో పలు కాలనీల్లో వర్షపు నీరు నిలిచింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మునిసిపల్ అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. భవానీపురం హెచ్‌బీ కాలనీలో మోటార్ల ద్వారా నీటిని తోడివేస్తున్నారు. విజయవాడ నూజివీడు రహదారిలో నున్న ఫైబర్ గ్రిడ్ వద్ద రోడ్డుపై వర్షపు నీరు ప్రవహిస్తోంది.
ఒకటో నంబరు హెచ్చరిక
కృష్ణానది ఉన్న ప్రకాశం బ్యారేజీ వద్ద వరద పోటెత్తింది. బ్యారేజీ వద్ద ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో 4,50,240 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. మధ్యాహ్నం ఒంటి గంటలకు 5,65,201 క్యూసెక్కులకు చేరింది. ఆ తరువాత స్వల్పంగా తగ్గుతూ సాయంత్రం ఆరు గంటలకు 5,46,018 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజీ వద్ద నీటి మట్టం 14.5 అడుగులకు చేరింది. బ్యారేజీకి చెందిన మొత్తం 70 గేట్లను పూర్తిగా ఎత్తి వేసి వచ్చిన వరద వచ్చినట్లు సముద్రంలోకి వదులుతున్నారు.
జగ్గయ్యపేట నియోజకవర్గంలో..
జగ్గయ్యపేట నియోజకవర్గంలోని పెనుగంచిప్రోలు, వత్సవాయి, జగ్గయ్యపేట మండలాల్లో పాలేరు, మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెనుగంచిప్రోలు నుంచి నందిగామ వెళ్లే రోడ్డులో శనగపాడు వద్ద వరద తాకిడికి వాగుపై కల్వర్టు కొట్టుకుపోయింది. సుబ్బాయిగూడెం రహదారి ధ్వంసమైంది. అనిగండ్లపాడు – గుమ్మడిదూరు వెళ్లే రహదారి కొట్టుకుపోయి పెద్ద గుంతలు పడ్డాయి. జగ్గయ్యపేట మండలంలో షేర్ మహమ్మద్ పేట చెరువు పొంగడంతో జగ్గయ్యపేట రోడ్డు పై మూడు అడుగుల మేర వరద నీరు చేరి రాకపోకలు స్తంభించాయి. బూధవాడ అన్నవరం రెడ్డి నాయక్ తండ గ్రామాల్లో పాలేరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆ గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. వత్సవాయి మండలం లింగాల వద్ద మున్నేరుకు పది అడుగుల మేర వరద నీరు రావడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమలమయ్యాయి. గోపినేనిపాలెం చిట్యాల వద్ద రహదారిపైకి వర్షపు నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాలు నీటి మునిగాయి. జగ్గయ్యపేట పట్టణంలో పాలేరు ఎర్ర కాలువకు వరద నీరు ఉధృతంగా రావటంతో ఆయా ప్రాంతాల్లోని వాగులు వంకలు పొంగి పొర్లడమే కాకుండా ఇళ్లల్లోకి వరదనీరు వచ్చి చేరింది. జగ్గయ్యపేట– కోదాడ రోడ్డు నీటమునిగింది.
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ
విజయవాడ సిటీ