భరోసా మాయం...సేవకు మంగళం | - | Sakshi
Sakshi News home page

భరోసా మాయం...సేవకు మంగళం

Aug 15 2025 6:34 AM | Updated on Aug 15 2025 6:34 AM

భరోసా

భరోసా మాయం...సేవకు మంగళం

భరోసా మాయం...సేవకు మంగళం

అన్నదాతకు అందని సేవలు కృష్ణాజిల్లాలో 390 రైతు సేవా కేంద్రాలు రేషనలైజేషన్‌తో 337 మందితో నడుస్తున్న కేంద్రాలు కూటమి ప్రభుత్వ పాలనలో రైతులకు అరకొరగా సేవలు ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యంతో అన్నదాతల అవస్థలు

కూటమి చర్యలతో రైతులకు నష్టం

కంకిపాడు: కూటమి ప్రభుత్వ పాలనలో అన్నదాతలు అడుగడుగునా నిర్లక్ష్యానికి గురవుతున్నారు. ఓ వైపు రైతు సంక్షేమం వల్లె వేస్తూ రైతులను మాత్రం గాలికొదిలేస్తున్న ఘనత కూటమి సర్కారుకే చెల్లుతుంది. రైతులకు భరోసా కల్పిస్తూ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతుభరోసా కేంద్రాలను తీసుకొచ్చింది. అన్ని విధాలా అన్నదాతలకు బాసటగా నిలిచింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే పేరు మార్చి తద్వారా అందుతున్న సేవలకు సైతం మంగళం పాడేస్తోంది. రైతు సేవా కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది కుదింపుతో రైతు సేవా కేంద్రాలు మూతబడే ప్రమాదం కూడా గోచరిస్తోంది.

నాడు సంక్షేమం...నేడు నిర్వీర్యం...

వ్యవసాయం దండగ అన్న నేతలు ముక్కున వేలేసుకునేలా గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చేసి చూసింది. పరిపాలన గ్రామస్థాయికి తీసుకొచ్చింది. సచివాలయ వ్యవస్థ ద్వారా సేవలను ప్రతి ఒక్కరికీ చేరువ చేసింది. ఇందులో భాగంగానే వ్యవసాయం చేసే రైతులకు అవసరమైన అన్ని సేవలకూ మండల కేంద్రాలకు పరుగులు పెట్టకుండా రైతుభరోసా కేంద్రాల్లోనే అందుబాటులోకి తెచ్చింది. ఎరువులు, విత్తనాలు, పంట చేతికి వచ్చిన తరువాత పంట కొనుగోళ్లు సైతం ఈ కేంద్రాల ద్వారానే చేసింది. ప్రస్తుతం రైతు సేవా కేంద్రాల్లో పేరులోనే సేవ ఉంది తప్ప రైతులకు ఎలాంటి సేవలు అందడం లేదు. ఎరువుల సరఫరా పూర్తిగా సొసైటీల ద్వారానే సాగుతోంది. విత్తనాల పంపిణీలోనూ జాప్యం జరగటంతో రైతులు బయటి మార్కెట్‌పై ఆధారపడి విత్తనం తెచ్చుకుని అతికష్టం మీద ఈ ఖరీఫ్‌లో సాగు చేపట్టాల్సి వచ్చింది. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 390 రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 367 వ్యవసాయ శాఖ పరిధిలోనూ, 27 ఫిషరీస్‌ శాఖ పరిధిలోనూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఈ కేంద్రాల నిర్వహణను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. కియోస్క్‌లు మరమ్మతులకు గురయ్యాయి. వీటిని అందుబాటులోకి తీసుకొచ్చి సేవలను అందించటంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో నిర్మించిన రైతు సేవా కేంద్రాలు తుదిదశ పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేయటంతో ఆ భవనాలు అలంకార ప్రాయంగా మారాయి.

సిబ్బంది రేషనలైజేషన్‌తో సేవలు దూరం

తాజాగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతులకు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. గతంలో గ్రామ జనాభా ఆధారంగా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. దాన్ని కూటమి ప్రభుత్వం సాగు విస్తీర్ణం ఆధారంగా సిబ్బంది మదింపు చేసింది. వ్యవసాయశాఖ పరిధిలోని 367 రైతు సేవా కేంద్రాలకు గానూ వీఏఏలు 302 మంది, వీహెచ్‌ఏలు 18 మందిని కేటాయించారు. ఏఈఓలు 19, ఎంపీఈఓలు ఒకరు చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వీఏఏ, వీహెచ్‌ఏలే గ్రామాల్లో అందుబాటులో ఉండే పరిస్థితి. అది కూడా సాగు విస్తీర్ణం ఆధారంగా 337 కేంద్రాలకు పరిమితం చేయటంతో మిగిలిన కేంద్రాలకు తాళాలు పడినట్టే. ఆయా కేంద్రాలకు అదనపు బాధ్యతలు అప్పగించిన వీఏఏలు, వీహెచ్‌ఏలు గ్రామాల్లో అందుబాటులో లేక రైతులకు ఆ శాఖ ద్వారా సేవలు, సమాచారం కరువవుతోంది. అందుబాటులో రైతు సేవా కేంద్రాలు ఉన్నా అవి మూసి ఉంటుండటంతో సేవలు అందక అవస్థలు పడాల్సి వస్తోందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు సిబ్బంది మదింపుతో తమకు కేటాయించిన గ్రామాలకు వెళ్లి విధులు నిర్వహించాల్సి రావటంతో పనిభారం పెరుగుతోందని వీఏఏలు వాపోతున్నారు.

కూటమి ప్రభుత్వ చర్యలతో రైతులకు అడుగడుగునా కష్టాలే. గతంలో రైతు భరోసా కేంద్రాలతో రైతులకు భరోసాగా ఉండేది. ఎరువులు, విత్తనాలు సకాలంలో అందేవి. కియోస్క్‌ల ద్వారా మెరుగైన సేవలు అందించారు. కూటమి పాలనలో అవేవీ అందడం లేదు. సిబ్బంది రేషనలైజేషన్‌తో సేవలు కూడా రైతులకు అరకొరగా అందే పరిస్థితి. ఈ దుస్థితికి ప్రభుత్వ విధానాలే కారణం.

–కొండవీటి వెంకట సుబ్బారావు, రైతు, మంతెన

రైతు భరోసా కేంద్రాలను కూటమి ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలుగా పేరు మార్చింది. మారిస్తే మార్చారు కాని... ప్రస్తుతం రైతులకు భరోసా లేదు...సేవా లేదు. ఈ ప్రభుత్వంలో తమ గోడు పట్టించుకునే నాథుడే లేడని రైతులు వాపోతున్నారు.

భరోసా మాయం...సేవకు మంగళం 1
1/1

భరోసా మాయం...సేవకు మంగళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement