
మహనీయుల త్యాగఫలం
వారిని స్మరించుకుంటూ ముందడుగు వేద్దాం సమష్టి కృషితో జిల్లాను నంబర్ 1గా చేద్దాం జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ జిల్లా వ్యాప్తంగా ఘనంగా 79వ స్వాతంత్య్ర దిన వేడుకలు
నేటి స్వాతంత్య్రం
త్రివర్ణ పతాకం సగర్వంగా నింగికెగసింది. స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని ఎల్లెడలా చాటింది. స్వేచ్ఛా, స్వాతంత్య్రాల కోసం పోరాడిన సమరయోధులకు జిల్లా ప్రజలు నిండుమనసుతో నివాళులర్పించారు. భరతమాత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని ఎనిమిది దశాబ్దాలకు చేరువవుతున్న తరుణంలో ఆ స్ఫూర్తిని భావితరాలకు చాటేందుకు స్వాతంత్య్ర దిన సంబరాలను వేడుకగా జరుపుకొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఉత్సవాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ లక్ష్మీశ త్రివర్ణ పతాకం ఎగురవేశారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా భారత 79వ స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో వేడుకలు నిర్వ హించి జాతీయ పతాకాలను ఎగురవేశారు. కేడీసీసీబీ రీజనల్ కార్యాలయం, డీటీసీ కార్యాలయం, గ్రంథాలయాల్లో వేడుకలు జరిగాయి. వాడవాడలా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం చంద్రబాబునాయుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో జేసీ ఇలక్కియ, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహంతో కలిసి కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ జాతీయ జెండాను ఎగురవేశారు. తొలుత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్య్రాలని పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర దార్శనికతకు అనుగుణంగా అడుగులేస్తూ జిల్లాను అభివృద్ధి, సంక్షేమంలో నెం.1గా నిలిపేందుకు సమష్టిగా అడుగులేద్దామని అన్నారు. మహనీయుల ధైర్యం, త్యాగాలను స్మరించుకుంటూ ముందడుగు వేస్తూ జిల్లా, రాష్ట్రం, దేశ ప్రగతికి కృషిచేద్దామన్నారు. స్వర్ణాంధ్ర కలను సాకారం చేయాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పీ4 అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఆరోగ్య ఆంధ్ర సాకారానికి నిర్వహించిన యోగాంధ్రలో జిల్లాను ముందు వరుసలో నిలిపామని, ఇదే స్ఫూర్తితో అన్ని విధాలా ప్రగతికి చేయీచేయీ కలపాల్సిన అవసరముందన్నారు. జిల్లా, నియోజకవర్గాల దార్శనిక ప్రణాళికల అమల్లో మెరుగైన ఫలితాలు సాధించడం ద్వారా జిల్లా జీడీపీ, తలసరి ఆదాయ లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు.
విజయవాడ నగర వీధుల్లో శకటాల ప్రదర్శన
ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన...
ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో జరిగిన 79వ స్వాతంత్య్ర దిన వేడుకల్లో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన శకటాలను ప్రదర్శించారు. వేడుకల అనంతరం శకటాలను నగర వీధుల్లో యాత్రగా తీసుకెళ్లారు. బందరు రోడ్డు, బెంజ్ సర్కిల్, రామవరప్పాడు రింగ్, ఏలూరు రోడ్, కంట్రోల్ రూమ్, ఎంజీ రోడ్డు తదితర మార్గాల్లో ప్రదర్శించిన శకటాలు నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. వేడుకల్లో ప్రదర్శించిన పట్టు పరిశ్రమ శాఖ, మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ, మెప్మా శకటాలు మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి.

మహనీయుల త్యాగఫలం