
దుర్గమ్మకు కానుకగా బంగారు లక్ష్మీహారం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శుక్రవారం గుంటూరు జిల్లా వడ్లమూడికి చెందిన భక్తులు 82 గ్రాముల బంగారు లక్ష్మీహారాన్ని కానుకగా సమర్పించారు. వడ్లమూడికి చెందిన వి.శ్రవణ్‌కుమార్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. సుమారు రూ.8.50 లక్షల విలువైన 82 గ్రాముల బంగారం, పచ్చలతో తయారు చేయించిన లక్ష్మీహారాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఏఈవో ఎన్.రమేష్‌బాబు, ఇతర అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
ఈ–పంట నమోదు తప్పనిసరి
బుద్దవరం(గన్నవరం): మండలంలోని అల్లాపురం, బుద్దవరం గ్రామాల్లో జరుగుతున్న ఈ–పంట నమోదు ప్రక్రియను శుక్రవారం వ్యవసాయ సహాయ సంచాలకులు ఎం.సునీల్ పరిశీలించారు. ఈ–పంట నమోదుపై గ్రామ వ్యవసాయ సహాయకులకు ఆయన పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. గ్రామాల్లో రైతులు పండిస్తున్న ప్రతి పొలాన్ని ఈ–పంట నమోదు చేయాలని సూచించారు. రైతులకు సంబంధించిన ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఈ–పంట డేటా ఆధారంగానే తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ–పంట నమోదులో తప్పులు జరగకుండా జాగ్రత్తలు వహించాలని చెప్పారు. పంట పొలాల్లో గుర్తించిన చీడపీడలకు వివరాలు, ఫోటోలను ఏపీఎయిమ్స్ 2.0 యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారి కె.శివప్రసాద్, వీఏఏలు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం: అధిక వర్షాలు, వరదల ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, తక్షణం పంటల నష్టాన్ని అంచనావేసి నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్నీడి యలమందరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గుంటుపల్లి, మూలపాడు, త్రిలోచనాపురం గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాలు, వరదల ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను శుక్రవారం వారు పరిశీలించారు. రైతుల సమస్యలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. ఇందులో సుమారు లక్ష ఎకరాలకు పైగా వరికి నష్టం వాటిల్లిందని తెలిపారు. గుంటూరు జిల్లాలో 72 వేలు, బాపట్లలో 41 వేలు, ఎన్టీఆర్ జిల్లాలో 12 వేలు, కృష్ణాలో 10 వేలు, కాకినాడ జిల్లాలో 20 వేలు, ఉద్యాన పంటలు మరో 20 వేలు, ఇబ్రహీంపట్నంలో 500 ఎకరాల వరకు నష్టం జరిగిందని చెప్పారు. ఇతర జిల్లాల వివరాలు తెలియాల్సి ఉందన్నారు. నష్టాన్ని అంచనావేసి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రావణ మాసం నాల్గో శుక్రవారం, ఆగస్టు 15వ తేదీ సెలవుదినంతో పాటు, శనివారం శ్రీకృష్ణాష్టమి సెలవు, ఆదివారం ఇలా వరుసగా మూడు రోజుల సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రికి భక్తుల రద్దీ పెరిగింది. సెలవులకు తోడు వివాహ సుముహూర్తాలు కూడా ఉండడంతో నూతన వధూవరులు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి తరలివస్తుండడంతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. రాత్రి 10 గంటల వరకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు.

దుర్గమ్మకు కానుకగా బంగారు లక్ష్మీహారం

దుర్గమ్మకు కానుకగా బంగారు లక్ష్మీహారం

దుర్గమ్మకు కానుకగా బంగారు లక్ష్మీహారం