
న్యూయార్క్ నగరంలోని మాన్ హట్టన్ లోని సెంట్రల్ పార్క్, ప్రశాంతమైన సరస్సులు, పచ్చని పచ్చిక బయళ్లు, వనాలకు పేరొందింది. ఇక్కడే ఉన్న సెంట్రల్ పార్క్ జూ బెథెస్డా టెర్రస్ వంటి ప్రత్యేక ఆకర్షణలకు కూడా ఇది చిరునామా. అయితే ఇప్పుడు అది మరికొన్ని వైవిధ్యభరిత రుచులకు కూడా చిరునామాగా మారింది. ముఖ్యంగా భారతీయ రుచుల కోసం వెతుకుతున్న ఆహార ప్రియులకు అది తప్పనిసరి సందర్శనీయ స్థలంగా కూడా అవతరించింది. ఈ పార్క్ మధ్యలో తాజాగా తయారుచేసిన వడ పావ్‌ల సువాసన నాసికకు సోకుతుంటే ఆ ఉద్యానవనం మీదుగా వెళ్లే ఇండియన్ రుచుల అభిమానులు ఆగగలరా? ఇంతకీ ఈ పార్క్‌లో మన వంటల మార్క్ ఎలా సాధ్యపడింది?
ఈ ప్రశ్నకు సమాధానం న్యూయార్క్‌లో నివసిస్తున్న భారతీయ జంట షౌనక్ శివానీలు మాత్రమే చెప్పగలరు. ఎందుకంటే వారి ప్రత్యేకమైన ’వడ పావ్ ప్రాజెక్ట్’ ఆలోచన దీని వెనుక ఉంది కాబట్టి. మహారాష్ట్రలోనే పుట్టి పెరిగిన వారికి వడా పావ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఆ వంటకం దొరకని ప్రదేశంలో సదరు మహారాష్ట్రీయుల్ని ఉంచడం అంటే వారి జిహ్వకు ఎంత లోటో కూడా చెప్పనక్కర్లేదు.
అదే విధంగా ఈ జంట కూడా న్యూయార్క్‌కు వెళ్లాక తమకు ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఐటమ్, భారతీయ సంప్రదాయ వంటకాల్లో పేరొందిన వడ పావ్‌ను మిస్ అయ్యారు. మసాలాతో వేయించిన బంగాళాదుంప ముద్దని మృదువైన బన్ లోపల ఉంచి, టాంగీ, స్పైసీ చట్నీలతో చవులూరింపచేసే ఈ వంటకం మిస్ అవడం కన్నా బాధ ఏముంటుంది? అంటూ వాపోయారా దంపతులు.
‘ఈ నగరంలో దోసెలు, పానీపురి, కతి రోల్స్( విభిన్న రకాల వెరైటీలను రొట్టెల్లో చుట్టి అందించేవి) అందించే స్టాల్స్ చాలా ఉన్నప్పటికీ, ఇప్పటికీ వడ పావ్ మాత్రం ఇక్కడకి రాలేదు‘ అని శివాని తన అభిమాన వంటకం లేకపోవడం గురించి పంచుకున్నారు. దాంతో ‘మేం పటేల్ బ్రదర్స్(అమెరికాలో భారతీయ ఉత్పత్తులకు పేరొందిన స్టోర్)కు ట్రిప్‌లు వేశాం, మా రెసిపీతో ప్రయోగాలు చేశాం, చట్నీలను తయారు చేసాం ఓ ఫైన్ మార్నింగ్ నుంచి సెంట్రల్ పార్క్‌లో వడ పావ్ పిక్నిక్‌లను నెలవారిగా నిర్వహించడం ప్రారంభించాం‘ అంటూ వీరు చెబుతున్నారు.
వీరి ప్రాజెక్టుకు అక్కడి భారతీయుల నుంచే కాక స్థానికుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ‘మేం ఇప్పటికే వందలాది మందికి పైగా వడ్డించాం అందరి ప్రేమ అభిప్రాయాలకు చాలా కృతజ్ఞతలు. ఇకపై మా నెలవారీ కార్యక్రమాలను మరింత ఉత్సాహఃగా కొనసాగించాలని ఆశిస్తున్నాం‘ అని వారు అంటున్నారు. వీరి రుచుల పిక్నిక్ ఆన్ లైన్ లో కూడా అనేకమందిని ఆకర్షించింది, నెటిజన్లు ఎందరో ఈ ప్రయత్నాన్ని ప్రశంసించారు.
‘అద్భుతం అని ఒకరంటే..‘‘ మాకు కూడా చికాగోలో ఒకటి అవసరం’’ అని మరొకరు, ‘ఓరి దేవుడా, ఇది ఎప్పటి నుంచో నా మనసులో ఉంది. ఇప్పటికి నిజమవడం చూసి చాలా సంతోషంగా ఉంది’’ అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ‘‘ ఈ నగరానికి ఖచ్చితంగా వడ పావ్ అవసరం. ఇక్కడ మిలియన్ బేకరీలు ఉన్నప్పటికీ, ప్రపంచంలోని ఏ బ్రెడ్ ముంబై పావ్‌తో సరిపోలదు‘ అంటూ ఒక వడ పావ్ ప్రేమికుడు సగర్వంగా ఆన్‌లైన్‌లో తన అభిప్రాయం పంచుకున్నారు. ఒక భోజన ప్రియుడు మరింత ముందుకెళ్లి ‘అమెరికాలో ప్రతి మూలలో తాజా వడా పావ్, దబేలి, భేల్పురి చాట్ అవసరం’’ అంటూ తేల్చేశాడు.
(చదవండి: Success Story: అతను ఐఐటీ, ఐఐఎం గ్రాడ్యుయేట్ కాదు..కానీ సంపదలో అదానీ రేంజ్..!)