
లింగాలఘణపురం: అమెరికాలోని ఓక్లహోమ్ రాష్ట్రంలోని ఎడ్జుండ్ నగరంలో ఉంటున్న జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నెల్లుట్లకు చెందిన కుర్రెముల సాయికుమార్ (31) బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడటంతో అక్కడి కోర్టు 35 ఏళ్ల శిక్ష విధించింది. దీంతో మానసిక ఆందోళనకు గురై సాయికుమార్ జూలై 26న జైలులోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు గత నెల 31న అమెరికా బయల్దేరారు. సాయికుమార్ పదేళ్ల కిందట అమెరికా (America) వెళ్లి అక్కడే ఉద్యోగం చేస్తూ ఓక్లహోమ్‌లో ఉంటున్నాడు.
2023లో అక్కడి ఎఫ్‌బీఐ సోషల్ మీడియా మేనేజింగ్ యాప్‌లో నిందితుడి అకౌంట్‌పై విచారణ జరపగా 13–15 ఏళ్ల బాలుడిగా నటిస్తూ బాలికలతో నమ్మకంగా ఉంటుండేవాడు. అతని అభ్యర్థనను తిరస్కరించిన వారిని బెదిరించడం, మానసికంగా వేధించడం, అసభ్య చిత్రాలు తీసి పంపించినట్లు ఆరోపణలు రావడంతో సాయికుమార్‌ను అరెస్ట్ చేశారు. అతను 19 మంది మైనర్లను లైంగికంగా వేధించినట్లు కోర్టులో నిరూపితమవడంతో 35 ఏళ్ల జైలు శిక్ష పడగా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.