ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే వ్యాఖ్యలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఈ విషయం చాలాకాలంగా అందరికీ తెలుసు కానీ.. తాజాగా దావోస్‌లో ఆయన తెలుగుదేశం అభిమానుల సమావేశంలో చేసిన వ్యాఖ్య మాత్రం ప్రవాస భారతీయులను బిత్తరపోయేలా చేసింది. ఎందుకంటే.. 195 దేశాల్లో ఈరోజు తెలుగు వాళ్లు ఉండేందుకు తానెప్పుడో ముప్ఫై ఏళ్ల క్రితం తీసుకున్న నిర్ణయమే కారణమి ఆయనగారు వాకృచ్ఛారు మరి!.
నిజానిజాలతో సంబంధం లేదు.. ఎవరు ఏమనుకుంటారన్న విషయమూ పట్టదు!. చదువుకోసం లేదంటే ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లడం ఆయా కుటుంబాలు తీసుకునే నిర్ణయం. వారి కష్టం. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలని ఎవరైనా ఎందుకు అనుకుంటారు?. ఉన్నచోట లేదా దేశంలో సరైన అవకాశాలు లేకపోతేనే కదా!. విదేశాల నుంచి యువత భారత్‌కు రాకపోవడానికి కూడా అక్కడ మంచి అవకాశాలు ఉండటమే కారణం. బతుకుతెరువు కోసం చాలామంది తెలుగువాళ్లు దశాబ్దాల క్రితమే అమెరికాకు వలస వెళ్లారు. వెళుతున్నారు కూడా. అది తప్పు కాదు కానీ.. అదంతా తనవల్లే అని చంద్రబాబు వంటి వారు చెప్పడం మాత్రం దారుణం.
అమెరికాలో తెలుగువాళ్లు కాస్తో, కూస్తో మెరుగ్గా ఉండవచ్చు. పైగా డాలర్ మారకపు విలువ ఎక్కువ ఉండటం కూడా ఒక ఆకర్షణ. కానీ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తరువాత వీసా దొరకడమే పెద్ద సమస్యగా మారింది. ఆర్థిక కారణాలను పక్కనబెడితే ఏ దేశంలోనైనా విదేశీయులు రెండో తరగతి పౌరులుగానే జీవించాల్సి వస్తుంది. విదేశీయులకు అమెరికాలో గ్రీన్ కార్డు రావడానికి, ఆ దేశ పౌరుడు అయ్యేందుకు ఎంత వ్యయం చేయాలో, ఎన్ని సంవత్సరాలు ఆగాలో అందరికి తెలుసు.అదేమీ గొప్ప సంగతి కాదు. పైగా విదేశాలకు వెళ్లడం అన్నది చంద్రబాబు కనిపెట్టింది కాదు!!. స్వాతంత్రం రాక ముందు నుంచి ఉన్నదే..
..1970వ దశకంలో భారత ప్రభుత్వం మేధో వలసను ఆపేందుకు రకరకాల ప్రయత్నాలు చేసింది. అంటే మన మేధస్సు ఇతర దేశాలకు కాకుండా దేశాభివృద్ధికి దోహదపడాలన్న ఆలోచనలు చేశారు. అయినా వలసలు ఆగలేదు. ఇది నిజానికి భారత్‌కు ప్రతిష్ట కాదు. ఉదాహరణకు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా అమెరికా దేశానికి ఉపయోగపడుతున్నారు. ఆ కంపెనీ విస్తరణలో భాగంగానే మన దేశంలో కూడా పెట్టుబడులు పెడుతుండవచ్చు. అలాగే గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్, ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు వంటివారు మరికొందరు ఉండవచ్చు. కాని అలాంటి మేధావులను మనం ఎందుకు ఇక్కడే ఉంచి వారికి అవకాశాలు కల్పించలేకపోయాం అన్నదాని గురించి ఆలోచించకుండా అదే గొప్ప విషయం అన్నట్లు చెబుతుండడం యువతను మభ్య పెట్టడమే.
అమెరికా తర్వాత మన భారతీయులు, అందులోను తెలుగువారు ఇంగ్లండ్, సింగపూర్, దుబాయి వంటి దేశాలకు ఉపాధి నిమిత్తం వెళుతుంటారు. గల్ఫ్ దేశాలలో ప్రత్యేకించి అంతగా చదువు లేనివారు వెళ్లి ఎన్ని కష్టాలు పడుతున్నది తెలిసిందే. ఒంటెలు, గొర్రెలు కాపలా కాసే ఉద్యోగాలలో ఉంటున్నారు. నిర్మాణ రంగంలో చాకిరి చేస్తున్నారు. చివరికి అక్కడి షేక్‌లు, ఇతర వ్యాపారుల వద్ద బానిసలుగా బతుకుతున్న ఘట్టాలు కోకొల్లలు.విదేశీ వ్యామోహాన్ని అడ్డు పెట్టుకుని పలు ఏజెన్సీలు యువతను మోసం చేస్తూనే ఉన్నాయి. ఇక్కడ చదువుకుంటున్నప్పుడు అటు చీపురు ఇటు వేయడానికి నామోషీగా ఫీల్ అయ్యేవారు అమెరికా తదితర దేశాలకు వెళ్లినప్పుడే వారే బాత్రూములు శుభ్రం చేయవలసిన పరిస్థితికి బాధ పడుతుంటారు. మాల్స్‌లో, పెట్రోల్ బంకుల్లో చిన్న, చిన్న ఉద్యోగాలు చేస్తూ కాలం వెళ్లదీసేవారు చాలామంది ఉన్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. సైబర్ ఫ్రాడ్ కారణంగా కొన్ని దేశాలకు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన వారిని మన దేశం వెనక్కి తీసుకు వస్తుంటుంది. పర్యాటకం కోసం విదేశాలకు వెళ్లడం వేరు. వ్యాపారం, లేదా మంచి ఉద్యోగం వస్తే వెళ్లవచ్చు. కాని విదేశాలపై మోజుతో వెళ్లి చాలామంది అవస్థలు పడుతున్నారు.
అలాంటప్పుడు.. అమెరికా నుంచి వెనక్కి రావచ్చు కదా అని అడిగితే మన తెలుగువారు ఏమి చెబుతారో తెలుసా! ఇక్కడ రూల్స్ సరిగా ఉండవు. భారత్‌లో అవినీతి ఎక్కువ అని. వాటిని సరి చేయడానికి చంద్రబాబు వంటివారు చేసిన కృషి ఏమి ఉంది? పైగా అబద్దపు హామీలు, అక్రమాలతో ఎన్నికలలో గెలవడం వంటివి చేయడానికి వెనుకాడరు. తెలంగాణ ఉద్యమం రావడానికి నిరుద్యోగం కూడా ఒక కారణం అని ఈ రాష్ట్ర నేతలు చెబుతారు. మాజీ సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో మహబూబ్ నగర్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి యువత అరేబియా దేశాలకు వెళ్లి నానా అగచాట్లు పడుతున్నారని, ముంబై వంటి నగరాలకు వలస పోతున్నారని వారందరిని వెనక్కి వచ్చేలా చేస్తామని అనేవారు. పాలమూరులో కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా ఆ వలసలను ఆపగలిగామని అంటారు. మరి ఏపీలో సైతం కోనసీమసహా పలు ప్రాంతాల యువకులు లక్షల మంది ఎక్కడైనా సరే ఉద్యోగమంటూ వస్తే చాలని ఎదురు చూసేవాళ్లు ఉన్నారు.
అవన్నీ ఎందుకు హైదరాబాద్ నగరంలో స్థిపరడిన ఆంధ్ర ప్రాంతం వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఎందుకు వచ్చాయి?. పొట్టచేత పట్టుకుని వచ్చారని, కడుపు కొడుతున్నారని ఎందుకు తెలంగాణ ఉద్యమంలో విమర్శించే వారు. తెలంగాణలోనే ఆంధ్రులు ఒకరకంగా రెండో తరగతి పౌరులుగా ఉండే పరిస్థితి ఉండిందా? లేదా?. చంద్రబాబు వాదన ప్రకారం మన రాష్ట్రం నుంచి బెంగుళూరు, చెన్నై, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు, కూలి, నాలి చేసుకుని బతకడం కూడా ఆయన గొప్పే అనుకోవాలి. కుప్పం నుంచి రోజూ వేల మంది బెంగుళూరు వెళుతుంటారు. బీహారు, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి వేల మంది ఏపీ, తెలంగాణలకు వచ్చి నిర్మాణ పనులు, ఇతర చిన్న,చిన్న కూలీ పనులు చేసుకుంటున్నారు. వారంతా అలా వెళ్లడం తన ఘనతే అని ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావించగలుగుతారా? అలాగే చంద్రబాబు చెప్పేది కూడా అర్థంలేని విషయం.
పోనీ చంద్రబాబు వల్లే విదేశాలకు వెళ్లారన్నది కూడా అర్ధరహితం. ఎప్పటి నుంచో ఉన్నదే. ఎన్.టి.రామారావు విదేశాలలో ఉన్న తెలుగు వారు వెనక్కి రావాలని పిలుపు ఇచ్చి వారితో పెట్టుబడులు పెట్టించడానికి ఎన్ రిచ్ అనే ఎన్.ఆర్.ఐ. సంస్థను స్థాపించారు. 1960లలోనే అనేక మంది వైద్యులు భారత్ నుంచి అమెరికా తదితర దేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. ఉమ్మడి ఏపీలో 1992లోనే నేదురుమల్లి జనార్ధనరెడ్డి టైమ్ లో అమీర్‌పేటలో ఉన్న మైత్రివనం భవనంలో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కు ఉండేది. అక్కడ నుంచి మాదాపూర్ వైపు తరలించడానికి ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీని తీసుకు వచ్చి శంకుస్థాపన చేయించారు. భారత్ కంప్యూటర్ యుగం ఆరంభమైంది అప్పటి నుంచి. చంద్రబాబు 2000వ సంవత్సంలో హైటెక్ సిటీ అనే పేరుతో ఒక భవనాన్ని నిర్మించారు. అప్పటికే దేశంలోని బెంగుళూరు, ముంబై, చెన్నై నగరాలు ఐటి రంగంలో ప్రసిద్ది గాంచాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఫీజ్ రీయింబర్స్ మెంట్ స్కీమ్‌తో ఇంజనీరింగ్ విద్య పేద వర్గాలకు బాగా అందుబాటులోకి వచ్చింది. ఆ కారణంగానే తాము చదువుకుని విదేశాలకు వెళ్లి స్థిరపడ్డామని పలువురు చంద్రబాబు ప్రకటనపై స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
2000 సంవత్సరం నాటికే లక్షలాది మంది తెలుగువారు విదేశాలలో ఉద్యోగార్థం వెళ్లారన్నది వాస్తవం. కాని అదంతా తమ క్రెడిట్ అని ఆరోజుల్లో ఏ ముఖ్యమంత్రి చెప్పుకోలేదు. కాని చంద్రబాబు మాత్రం ప్రతిదానిని, తమ తల్లిదండ్రుల శ్రమని సైతం తన క్రెడిట్లో జమ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఎన్నారైలు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు చెప్పినట్లు నిజంగానే 195 దేశాలలో తెలుగువారు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ మేరకు ఏపీ వెనుకబడి ఉందని అర్థం కాదా?

::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


