‘తానా ప్రపంచసాహిత్య వేదిక’

Tana World Literary Platform - Sakshi

డెట్రాయిట్, అమెరికా: ఉత్తరఅమెరికా తెలుగుసంఘం సాహిత్యవిభాగం – ‘తానా ప్రపంచసాహిత్య వేదిక’ ఆద్వర్యంలో ప్రముఖ సినీకవి, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి సమగ్రసాహిత్యాన్ని సిరివెన్నెల కుటుంబసభ్యుల సహకారంతో అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన మొత్తం ఆరు సంపుటాలలో ముద్రించి సిరివెన్నెల అభిమానులకు, సాహితీ ప్రియులకు ఇటీవలే కానుకగా అందించిన సంగతి విదితమే. ఇప్పడు అదే స్ఫూర్తితో సుప్రసిద్ధ కవి, రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరిగారి సమగ్ర సాహిత్యాన్ని తానా పూర్వాధ్యక్షులు, తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు అయిన డా. ప్రసాద్ తోటకూర గారి నేతృత్వంలో ముద్రించి త్వరలో తెలుగు భాషాభిమానులకు, సాహితీప్రియులకు అందజేయనున్నామని తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు కొసరాజుగారి 37వ వర్దంతి (అక్టోబర్ 27) సందర్భంగా ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు.

ఇది తానా సంస్థ ఒక మహాకవికి ఇచ్చే ఘన నివాళిగా నిలుస్తుందని ఆయన అన్నారు. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు, డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ “దాదాపు నాల్గు దశాబ్దాలుగా సాగిన కవిరత్న, జానపద కవి సార్వభౌమ కొసరాజు రాఘవయ్య చౌదరిగారి సాహితీ ప్రయాణంలో “ఏరువాక సాగాలోరన్న”; “అయయో చేతిలో డబ్బులు పోయెనే, అయయో జేబులు ఖాళీ ఆయెనే”; “భలే ఛాన్సులే భలే ఛాన్సులే, ఇల్లరికంలో ఉన్న మజా”; “సరదా సరదా సిగరెట్టు, ఇది దొరలు కాల్చు సిగరెట్టు”; “రామయతండ్రి, ఓ రామయ తండ్రి, మానోములన్ని పండినాయి రామయ తండ్రీ”; “ఆడుతుపాడుతూ పనిజేస్తుంటే, అలుపూ సొలుపేమున్నది” లాంటి పాటలలో అచ్చతెలుగులోని అందాలు, జానపదుల భాషలోని సొగసులు, పల్లెపట్టు భాషలోని చమత్కారాలు, విరుపులు కొసరాజు గారి కలంనుండి రెండువందల చిత్రాలలో వెయ్యికి పైగా పాటలు జాలువారాయి.

కేవలం సినిమా పాటలేగాక కొసరాజు గారు “గండికోట యుద్ధము” అనే ద్విపద కావ్యము; “కడగండ్లు” అనే పద్యసంకలనం, “కొసరాజు విసుర్లు”, “కొండవీటి చూపు”, “నవభారతం”, “భానుగీత” లాంటి గ్రంధాలు, యక్షగానాలు, వీధిభాగవతాలు, హరికథలు, జముకుల కథలు, బుర్రకథలు, భజనగీతాలు, పగటివేషగాళ్ళ పాటలు, రజకుల పాటలు, పాములోళ్ళ పాటలు, గంగిరెద్దుల గీతాలు లాంటవి ఎన్నో రాశారని అన్నారు”.

ఈ సందర్భంగా కొసరాజు గారి కుటుంబసభ్యులతో మాట్లాడి ఎన్నో విషయాలను ఇప్పటికే సేకరించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న కొసరాజు గారి కుటుంబసభ్యులకు, కొసరాజు గారి సమగ్ర సాహిత్యాన్ని త్వరలో తెలుగు ప్రజలకు అందించే తానా ప్రపంచసాహిత్యవేదిక తలపెట్టిన సాహితీ మహాయజ్ఞంలో ప్రముఖ పాత్ర పోషించనున్న పేరెన్నికగన్న సాహితీవేత్త, పరిశోధకులు, అనుభవజ్ఞులు అయిన అశోక్ కుమార్ పారా (మనసు ఫౌండేషన్) కు కృతజ్ఞతలు అన్నారు తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top