
కొత్త తరహా రక్త పరీక్ష విధానాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలు
క్యాన్సర్‌ను తొలిదశల్లో వేగంగా గుర్తించేందుకు మార్గం సుగమం
వాషింగ్టన్: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అనే సామెత వినే ఉంటారు. ఇక్కడ ఒకే ఒక రక్త పరీక్షకు ఒకటికాదు రెండు కాదు ఏకంగా 50 రకాల క్యాన్సర్‌లను గుర్తించవచ్చు. పలు రకాల క్యాన్సర్‌లకు తొలి దశలో ఎలాంటి లక్షణాలు బయటకు కనబడవు. అలాంటి క్యాన్సర్ ముదరబోతోందనే హెచ్చరిక సంకేతాన్ని సైతం ఈ రక్తపరీక్ష అందివ్వగలదు.
ఉత్తరఅమెరికాలో ఇటీవల జరిపిన సంబంధిత ప్రయోగం విజయవంతమవడంతో బహుళ వ్యాధి నిర్ధారణ రక్త పరీక్షకు బాటలుపడ్డాయి. ఈ 50 క్యాన్సర్‌లలో దాదాపు మూడు వంతుల క్యాన్సర్‌లకు ఎలాంటి నిర్ధారణ పరీక్షలు లేవు. కానీ ఈ బ్లడ్‌టెస్ట్‌తో వాటి ఆనవాళ్లను సైతం ముందే కనిపెట్టవచ్చు. సగం క్యాన్సర్‌లను తొలిదశలోనే గుర్తింవచ్చు. దీంతో వాటికి వీలైనంత త్వరగా చికిత్స మొదలెట్టి వాటి బారి నుంచి తప్పించుకోవచ్చు.
అమెరికాకు చెందిన ‘గ్రెయిల్’ఫార్మాస్యూటికల్స్ సంస్థ ఈ బ్లడ్ టెస్ట్‌కు ‘గ్యాలెరీ’అని పేరుపెట్టింది. క్యాన్సర్ కణితి నుంచి ముక్కలై విడివడి మానవ రక్తప్రవాహంలో చక్కర్లు కొడుతున్న డీఎన్‌ఏ అవశేషాలను ఈ రక్తపరీక్ష ద్వారా గుర్తించవచ్చు. ఈ డీఎన్‌ఏ అవశేషాలు ఏ అవయవం నుంచి వస్తుందనేది కూడా ఈ బ్లడ్‌టెస్ట్ ద్వారా తెలుస్తుంది.
బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్(ఎన్‌హెచ్‌ఎస్) ద్వారా సేకరించిన వేలాది మంది పౌరుల రక్తనమూనాలను పరిశీలించి ఈ బ్లడ్‌టెస్ట్ సామర్థ్యాన్ని గణించారు. అమెరికా, కెనడాల్లో 25,000 మంది యుక్తవయసు వాళ్ల రక్తాన్ని సైతం సేకరించి నూతన తరహాలో రక్త పరీక్ష చేశారు. వీరిలో ప్రతి 100 మందిలో దాదాపు ఒక శాతం మంది క్యాన్సర్‌బారిన పడబోతున్నట్లు తేలింది. వీరిలో తర్వాతి కాలంలో 62 శాతం మందికి క్యాన్సర్ లక్షణాల బయటపడటం విశేషం.
‘‘క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల్లో ఇదొక మైలురాయి. ముదరక ముందే క్యాన్సర్‌ను కనిపెట్టడంతో దానికి చికిత్స చేయడం అత్యంత సులభమవుతుంది. చికిత్సలో విజయశాతాలు అద్భుతంగా ఉంటాయి’’అని అమెరికాలోని ఒరెగాన్ రాష్ట్రంలోని ఒరెగాన్ హెల్త్, సైన్స్ యూనివర్సిటీలో రేడియేషన్ మెడిసిన్ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ నిమా నబాబిజదేహ్ చెప్పారు. ‘‘క్యాన్సర్ ఉండకపోవచ్చు అని దాదాపు 99 శాతం మందిలో సాధారణ రక్తపరీక్షల్లో ‘నెగెటివ్’అని రాగా, అది తప్పు అని మా రక్తపరీక్ష నిరూపించింది’’ అని వివరించారు.