ప్రపంచ దేశాల నుంచి ఎంతో గౌరవమర్యాదలు అందుకునే బ్రిటన్ రాజ కుటుంబం.. నిగూఢ విబేధాలకూ కేంద్రంగా కూడా ఉంది. మరీ ముఖ్యంగా డయానా పిల్లలు ప్రిన్స్ విలియమ్, హ్యారీలు దూరం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ తరుణంలో హ్యారీ గురించి విలియమ్ చేసిన ఒక్క వ్యాఖ్య.. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది..
యాపిల్ టీవీ షో(The Reluctant Traveller) లో భాగంగా యూజీన్ లెవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో విలియమ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ‘‘హ్యారీ -నేను చిన్నతనంలో ఎదుర్కొన్న పాత పద్ధతులు మళ్లీ రాకూడదని ఆశిస్తున్నా. అలాంటి పరిస్థితులు తిరిగి రాకుండా ఉండేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా’’ అని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండడంతో ఏదైనా అద్భుతం జరగబోతోందా? అనే చర్చ జోరందుకుంది.

విలియం, హ్యారీలు బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-డయానా సంతానం. తల్లి డయానా ప్రమాదంలో మరణించాక గ్లోబల్ మీడియా దృష్టి ఇద్దరిపై ఉంటూ వచ్చింది. అయితే.. 2016 నుంచి ఈ అన్నదమ్ముల మధ్య విభేదాలు మొదలయ్యాయి. నటి మేఘన్ మార్కెల్‌ను 2018లో ప్రిన్స్ హ్యారీ వివాహం చేసుకున్నాక అవి మరింత ముదిరాయి. ఈ క్రమంలో 2020లో హ్యారీ రాజ కుటుంబ బాధ్యతల నుంచి తప్పుకుని భార్యతో అమెరికాకు వెళ్లిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2021లో ఓఫ్రా విన్‌ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ కుటుంబంపై హ్యారీ-మేఘన్‌లు చేసిన ఆరోపణలు ఆ గ్యాప్‌ను మరింత పెంచాయి. అప్పటి నుంచి ఆ అన్నదమ్ముల మధ్య మాటల్లేవ్!. ఈలోపు..
వీళ్లను కలిపేందుకు ప్రయత్నాలు చాలానే జరిగాయి. హ్యారీ అన్నతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నా విలియమ్ అందుకు సుముఖత వ్యక్తం చేయలేదనే ప్రచారం ఒకటి ఉంది. ఈలోపు కొన్ని వార్తా సంస్థలు.. హ్యారీ ఒక్కడిగా వస్తేనే తాను మాట్లాడతానంటూ విలియమ్ షరతు పెట్టినట్లు కథనాలు ఇచ్చాయి. 2022 సెప్టెంబర్‌లో వీళ్ల నాన్నమ్మ క్వీన్ ఎలిజబెత్ మరణించిన సమయంలోనూ ఈ ఇద్దరు కలుసుకుంటారనే ప్రచారం జరిగింది. ఆ మధ్య తండ్రిని కింగ్ చార్లెస్-IIIని చూడడానికి వచ్చిన సమయంలోనూ అన్నతో హ్యారీ భేటీ అవుతాడనే ప్రచారమూ జరిగింది. చివరిసారిగా ఈ ఇద్దరూ 2024 ఆగస్టులో మామ లార్డ్ రాబర్ట్ ఫెలోస్ స్మరణ సభలో పక్కపక్కనే కనిపించినా మాట్లాడుకోలేదు.
దీంతో.. విలియమ్ తాజా వ్యాఖ్యలతో అన్నదమ్ములు ఒక్కటవుతారా? అనే చర్చ నడుస్తోంది. అయితే.. అది కేవలం వ్యక్తిగత వ్యాఖ్య కాదని.. రాజ కుటుంబంలో తరం మార్పునకు సంకేతంగా భావించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చిన్నతనంలో ఆ అన్నదమ్ములు ఎదుర్కొన్న మీడియా ఒత్తిళ్లు, కుటుంబ వ్యవస్థల లోపాల గురించే విలియమ్ మాట్లాడి ఉంటారని, తన పిల్లల కోసం, భవిష్యత్ రాజ కుటుంబం కోసం మంచి వాతావరణం కల్పించేందుకు ప్రయత్నిస్తానని చెప్పి ఉంటారని విశ్లేషిస్తున్నారు. మరికొందరు మాత్రం ఈ వ్యాఖ్యలు కచ్చితంగా హ్యారీ, మేఘన్‌లకు సర్‌ప్రైజేనని అంటున్నారు.


