శంకరనేత్రాలయ అమెరికా సలహామండలి సభ్యుడిగా లక్ష్మీనరసింహన్ వాసన్ | -lakshminarasimhan vasan appointed to sankara netralaya usa advisory board | Sakshi
Sakshi News home page

శంకరనేత్రాలయ అమెరికా సలహామండలి సభ్యుడిగా లక్ష్మీనరసింహన్ వాసన్

Jul 11 2026 10:10 AM | Updated on Jul 11 2026 4:44 PM

-lakshminarasimhan vasan appointed to sankara netralaya usa advisory board

లాస్ ఏంజెలెస్: లాస్ ఏంజెలెస్: శంకర నేత్రాలయ సంస్థ అమెరికా సలహా మండలి (అడ్వైజరీ బోర్డు) సభ్యుడిగా లక్ష్మీ నరసింహన్ వాసన్‌ను నియ‌మితుల‌య్యారు. అమెరికన్ కిచెన్ ఎక్విప్మెంట్ రంగంలో స్వయంకృషితో  అంచెలంచెలుగా ఎదిగిన‌ ఆయ‌న ఎన్నో సమాజ సేవ, దాతృత్వ కార్యక్రమాలు చేప‌ట్టారు. ఆయ‌నను ప్రతీష్టాత్మకమైన అడ్వైజరీ బోర్డులో స‌భ్యుడిగా నియ‌మించామ‌ని సంస్థ అధ్యక్షులు బాలరెడ్డి ఇందుర్తి తెలియచేశారు.

ఈ సంద‌ర్భంగా శంకర నేత్రాలయ యూఎస్ఏ నాయకత్వ బృందం, ఇతర సలహా మండలి సభ్యులు, శంకర  నేత్రాలయ ఇండియా అధ్యక్షులు డాక్టర్ గిరీష్ రావు త‌దిత‌రులు లక్ష్మీ నరసింహన్ వాసన్‌, ఆయన సతీమణి డాక్టర్ బృందా సుబ్రహ్మణియన్‌కు స్వాగతాభినందనలు తెలియచేశారు.  

లక్ష్మీ నరసింహన్ వాసన్ తమిళనాడులోని ఈరోడ్ సమీపంలోని పసూర్ గ్రామంలో జన్మించి, హైదరాబాద్‌లో పెరిగారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఇంజినీరింగ్ పట్టా పొందిన అనంతరం, 1981లో ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లారు. అనంతరం విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగి, ఇటీవల దక్షిణ కాలిఫోర్నియాలోని రాయల్ కిచెన్ ఎక్విప్‌మెంట్ కంపెనీ ప్రధాన కార్యనిర్వాహణ అధికారి (CEO)గా సేవలందించారు.

ఆయ‌న‌కు క్రీడారంగంలో కూడా విశిష్టమైన ప్రస్థానం ఉంది. అమెరికాకు వెళ్లే ముందు ఆయన భారతదేశంలో ఫస్ట్ క్లాస్ క్రికెటర్‌గా రాణించి, హైదరాబాద్ రంజీ ట్రోఫీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆయన నాయకత్వంలోని జట్టులో మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి, మహ్మద్ అజహరుద్దీన్, శివలాల్ యాదవ్ వంటి ప్రముఖ ఆటగాళ్లు సభ్యులుగా ఉన్నారు. భారత‌దేశంలో జరిగిన వివిధ క్రికెట్ మ్యాచ్‌లలో కూడా పాల్గొన్న ఆయన, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, కృష్ణమాచారి శ్రీకాంత్, సయ్యద్ కిర్మాణి, ఎస్. వెంకటరాఘవన్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలతో కలిసి మైదానాన్ని పంచుకున్నారు.

లక్ష్మీ నరసింహన్ వాసన్ 1988లో డాక్టర్ బృందా సుబ్రహ్మణియన్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కుమారుడు డాక్టర్ కార్తీక్ వాసన్ వైద్య పరిశోధనలో పీహెచ్‌డీ. పూర్తి చేయగా, కుమార్తె మయూరి వాసన్ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలిగా గుర్తింపు పొందారు.

దాతృత్వ సేవలను జీవిత ధ్యేయంగా భావించిన లక్ష్మీ నరసింహన్, భారతదేశం, అమెరికాలో అనేక సేవా కార్యక్రమాలకు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. ఇటీవల శంకరనేత్రాలయా సంస్థకు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల డాలర్ల విరాళం ప్రకటించారు. ఈ విరాళంతో, శంకరనేత్రాలయ సంస్థ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ ప్రాంతంలో  పూర్తిస్థాయి సౌకర్యాలతో కూడిన మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ (MESU) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దీనివల్ల మధ్యప్రదేశ్, సమీప ఐదు రాష్ట్రాల పేదప్రజలకు కంటిచూపు సంబందించిన వ్యాధుల నివారణకు సహాయపడుతుంది. ఈ యూనిట్ ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలు మరింత విస్తృతంగా అందించే అవకాశం కల్పిస్తుంది.

శంకర నేత్రాలయ యూఎస్ఏ వ్యవస్థాపకులు, ప్రెసిడెంట్‌ ఎమిరిటస్ ఎస్ వి ఆచార్య, పద్మభూషణ్ డాక్టర్ జగదీశ్ సేథ్, ప్రసాద్ రెడ్డి కాటంరెడ్డి, శ్రీమతి లీల క్రిష్ణమూర్తి , డాక్టర్ రాజ్ మోదీ, డాక్టర్ కిశోర్ చివుకుల , ఉదయ భాస్కర్ గంటి, శ్యామ్ అప్పలి, శ్రీ మూర్తి రేకపల్లి, వంశీకృష్ణ ఏరువరం, డాక్టర్ రెడ్డి ఊరిమిండి, వాసన్ కుటుంబం అందిస్తున్న విశేష దాతృత్వ సేవలను, సంకర నేత్రాలయ లక్ష్య సాధనకు వారు అందిస్తున్న సహకారాన్ని హృదయపూర్వకంగా అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement