అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి గుడ్‌న్యూస్‌ను అందరితో పంచుకున్నారు. మరోసారి తండ్రి కాబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటించారు. ఈ విషయాన్ని అటు ఆయన సతీమణి, అమెరికా సెకండ్ లేడీ ఉషా వాన్స్ కూడా ధృవీకరించారు. దీంతో వాళ్లకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
వాన్స్ దంపతులు త్వరలోనే నాలుగో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జులై చివరిలో పండంటి మగబిడ్డ తమ జీవితాల్లోకి రానున్నట్లు తెలిపారు. జేడీ- ఉషా వాన్స్‌లకు 2014లో వివాహం జరిగింది. వీరికి ఇప్పటికే ఈవాన్, వివేక్, మిరాబెల్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.

జేడీ వాన్స్ (James David Vance).. 1984 ఆగస్టు 2న ఓహియో స్టేట్‌లోని మిడిల్‌టౌన్‌లో జన్మించారు. స్థానిక స్టేట్ యూనివర్సిటీలో చదివి, తరువాత యేల్ లా స్కూల్‌లో న్యాయ విద్య పూర్తి చేశారు. 2016లో ఆయన ఆత్మకథ “Hillbilly Elegy” అమెరికా అంతటా విశేష ఆదరణ పొందింది. ఈ పుస్తకం ఆధారంగా Netflix చిత్రం కూడా రూపొందింది. 2022లో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసి, ఓహాయో నుంచి సెనేటర్‌గా ఎన్నికయ్యారు. తన స్పష్టమైన అభిప్రాయాలు, ప్రజల సమస్యలపై దృష్టి పెట్టడం వల్ల జనాదరణ పొందగలిగారు. 2025 జనవరి 20న జేడీ వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి ఆయన వైట్ హౌస్‌లో పనిచేస్తున్నారు.
ఉషా చిలుకూరి అమెరికాలో కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. యేల్ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. న్యాయ విభాగంలో సుదీర్ఘ కాలం పనిచేశారు.
We’re very happy to share some exciting news. Our family is growing! pic.twitter.com/0RohEBYXM7
— Second Lady Usha Vance (@SLOTUS) January 20, 2026
యేల్ లా స్కూల్‌లోనే ఉషా, జేడీ వాన్స్ (JD Vance) తొలిసారి కలుసుకున్నారు. ఈ క్రమంలోనే పరస్పరం ఇష్టపడ్డారు. ఈ క్రమంలో కెంటకీలో వారు వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయంలో వీరి వివాహం జరగడం విశేషం. జేడీ వాన్స్ క్రిస్టియానిటీ, ఉష హిందూ మతాన్ని అనుసరిస్తున్నారు.


