తెలంగాణ స్ఫూర్తిని చాటుతూ అమెరికాలో కొత్త చాప్ట‌ర్‌లు ప్రారంభించిన జీటీఏ | Gta Launches New Chapters In America | Sakshi
Sakshi News home page

తెలంగాణ స్ఫూర్తిని చాటుతూ అమెరికాలో కొత్త చాప్ట‌ర్‌లు ప్రారంభించిన జీటీఏ

Jul 25 2025 4:12 PM | Updated on Jul 25 2025 4:17 PM

Gta Launches New Chapters In America

 ముఖ్య అతిథిగా పార్సిప్పనీ మేయర్ జేమ్స్

ఘ‌నంగా న్యూజెర్సీ, న్యూయార్క్ చాప్టర్ల గ్రాండ్ లాంచింగ్

43 దేశాల‌కు విస్త‌రించిన‌ తెలంగాణ గ్లోబల్ అసోసియేషన్

న్యూజెర్సీ/న్యూయార్క్: తెలంగాణ సంస్కృతి సాంప్ర‌దాయాల‌ను 43 దేశాల్లో ఘనంగా చాటుతున్న తెలంగాణ గ్లోబల్ అసోసియేషన్ (GTA) మరో కీలక ముందడుగు వేసింది. అమెరికాలోని న్యూజెర్సీ, న్యూయార్క్ రాష్ట్రాల్లో జీటీఏ చాప్టర్లను అంగరంగ వైభవంగా ప్రారంభించింది. జూలై నెలలో న్యూజెర్సీలో జరిగిన ఈ కార్యక్రమానికి పార్సిప్పనీ మేయర్ జేమ్స్ ఆర్ బార్బెరియో ముఖ్య అతిథిగా హాజరై శుభాకాంక్షలు తెలిపారు. జీటీఏ ఫౌండర్స్ అలుమల మల్లారెడ్డి (ఇండియా ఛైర్మన్), విశ్వేశ్వర్ రెడ్డి (అమెరికా ఛైర్మన్) అతిథులను ఆత్మీయంగా సత్కరించారు.

ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలు, పాటలు, నృత్యాలతో ఆహ్లాదంగా సాగిన ఈవెంట్‌లో కపిడి శ్రీనివాస్ రెడ్డి జీటీఏ న్యూజెర్సీ, న్యూయార్క్ చాప్టర్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "జీటీఏలో భాగమవడం ఒక గౌరవం. అమెరికాలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా జీటీఏ కార్యకలాపాలను విస్తరించేందుకు కృషి చేస్తాను" అని హామీ ఇచ్చారు.

ఈ లాంచింగ్ ప్రోగ్రాంలో ప్రముఖులు టీటీఏ అమెరికా ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది, యూఎస్ జీటీఏ ప్రెసిడెంట్ బాపు రెడ్డి, చార్లెస్ చాప్టర్ డైరెక్టర్ మన్మోహన్, న్యూజెర్సీ ఐకా ప్రతినిధులు మహేందర్ రెడ్డి ముసుగు, పృథ్వీ రెడ్డి, వాషింగ్టన్ డీసీ ప్రెసిడెంట్ తిరుమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జీటీఏ ఫౌండర్, ఇండియా ఛైర్మన్ అలుమల మల్లారెడ్డి మాట్లాడుతూ.. “జీటీఏ మూడేళ్ల క్రితం ప్రారంభ‌మై అప్పుడే 43 దేశాల‌కు విస్త‌రించింది. డిసెంబ‌ర్‌లో విశ్వేశ్వర్ రెడ్డితో పాటు మా టీం అంద‌రి ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్‌లో క‌న్వెన్ష‌న్ ప్లాన్ చేస్తున్నాం. ప్ర‌తి ఒక్క తెలంగాణ ఎన్నారై త‌మ సొంత గ్రామానికి క‌నెక్ట్ చేసే విధంగా జీటీఏ సంస్థ‌ ప్ర‌య‌త్నిస్తుంది. సొంత గ్రామానికి, ప్రాంతానికి బ్రాండ్ అంబాసిడ‌ర్ కావాలి. రాజ‌కీయాల‌ను సైతం మార్చే శ‌క్తిగా మారాలి. మ‌న సంస్కృతి, సాంప్ర‌దాయాలను ఎన్నారైల పిల్లలు కూడా పాటించ‌డం, సొంత గ్రామానికి నాయ‌కుల‌తో క‌లిసి అభివృద్ధి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం, మ‌న యువ‌త‌కు మ‌ద్ద‌తుగా నిల‌వడం వంట కార్య‌క్రమాలు చేప‌డ‌తాం.” అని తెలిపారు.      

జీటీఏ ఫౌండర్, అమెరికా ఛైర్మన్ విశ్వేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. “తెలంగాణ ఎన్నారైలంద‌రిని ఒకే వేదిక‌పైకి తీసుకు వ‌చ్చి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల‌నే ల‌క్ష్యంతో తెలంగాణ గ్లోబల్ అసోసియేషన్ ప్రారంభించాము. మూడేళ్ల‌లోనే జీటీఏ 43 దేశాల‌కు విస్త‌రించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న తెలంగాణ స‌మాజాన్ని విద్య‌, వైద్యం, ఉపాధి, సాంస్కృతిక రంగాల్లో ఒక చోటికి తీసుకు వ‌స్తోంది జీటీఏ..” అని చెప్పారు.

టీటీఏ అమెరికా అధ్య‌క్షుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ, “జీటీఏతో కలిసి పనిచేయడం గర్వంగా ఉంది. డిసెంబర్ 10న అమెరికాలో, డిసెంబర్ 25న హైదరాబాద్‌లో టీటీఏ దశాబ్దోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. అలాగే వచ్చే జూలైలో చార్లెస్‌లో జీటీఏ కన్వెన్షన్ ఉంటుంద‌ని, అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాం” అన్నారు.

జీటీఏ కో ఫౌండర్ శ్రావణ్ రెడ్డి మాట్లాడుతూ, “న్యూజెర్సీ, న్యూయార్క్ చాప్టర్ల ప్రారంభం ఒక మంచి మైలురాయిగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలకు ఒక సమర్థవంతమైన వేదికగా జీటీఏ నిలుస్తోంది. సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తాం” అన్నారు.

జీటీఏ: ఒక ఉద్యమం – ఒక వ్యవస్థ
జీటీఏ ప్రారంభమైన‌ మూడేళ్లలోనే 43కి పైగా దేశాల్లో విస్తరించింది. విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, మహిళా సాధికారత, సాంస్కృతిక అభివృద్ధి, తెలంగాణ గ్రామీణ అభివృద్ధి వంటి అనేక రంగాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. తెలంగాణ పౌరుడి గొంతును ప్రపంచమంతా వినిపించాలనే సంకల్పంతో జీటీఏ ఫౌండర్స్ విశ్వేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నారు. "జీటీఏ పేరు కాదు – ఇది ఒక సామాజిక శక్తి, ఒక సేవా వ్యవస్థ" అని నిర్వాహకులు గర్వంగా చెబుతున్నారు. ప్రపంచంలోని అన్ని రాష్ట్రాలలోనూ జీటీఏ కార్యకలాపాలు విస్తరించడం లక్ష్యంగా జీటీఏ బృందం ముందుకు సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement