అమెరికా స్పెల్లింగ్‌ బీ విజేతగా 14 ఏళ్ల భారత సంతతి దేవ్‌ షా

dev shah spelling bee US Spelling Bee 2023 Winner Details - Sakshi

అమెరికాలో ఏటా జరిగే ప్రతిష్టాత్మక స్పెల్లింగ్‌ బీ పోటీల్లో ఈ ఏడాది భారత సంతతికి చెందిన 14 ఏళ్ల కుర్రాడు దేవ్‌ షా విజేతగా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం.. గురువారం రాత్రి  2023 స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ ట్రోఫీతో పాటు 50వేల డాలర్ల(మన కరెన్సీలో 41 లక్షల రూపాయలకు పైనే..) క్యాష్‌ ప్రైజ్‌ అందుకుని వార్తల్లోకి ఎక్కాడు. 

psammophile అనే పదానికి కరెక్ట్‌గా స్పెల్లింగ్ చెప్పాడు దేవ్ షా (14).  psammophile అంటే డిక్షనరీ మీనింగ్‌.. ఇసుకలో ఉండే జీవులు. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఈ పోటీలో ఈమారు మొత్తం కోటి పది లక్షల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. తుది దశకు చేరుకున్న 11 మందిలో దేవ్ షా కూడా ఒకరు. గత 24 ఏళ్లలో ఈ పోటీల్లో గెలిచిన 22వ దక్షిణాసియా సంతతి వ్యక్తిగా దేవ్ షా నిలవడం గమనార్హం. 

‘స్పెల్లింగ్ బీ’ విజేతగా నిలిచినందుకు దేవ్ షా సంబరపడిపోయాడు. ‘‘ఇది అస్సలు నమ్మలేకపోతున్నాను. నా కాళ్లు ఇంకా వణుకుతున్నాయి’’ అని వ్యాఖ్యానించాడు. ఇక వర్జీనియా రాష్ట్రానికి చెందిన 14 ఏళ్ల షార్లెట్ వాల్ష్ ఈ పోటీలో రెండో స్థానంలో నిలిచింది. 

దేవ్‌ తండ్రి దేవల్‌ 29 ఏళ్ల కిందట అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. ఆయన కుటుంబం ప్రస్తుతం ఫ్లోరిడాలో ఉంటోంది. గతంలో దేవ్‌ షా రెండుసార్లు ఈ పోటీల్లో పాల్గొన్నాడు. మూడేళ్ల వయసు నుంచే సరైన స్పెల్లింగ్స్‌ చెప్పడం దేవ్‌ షా ప్రారంభించాడని, ప్రస్తుతం ఈ ఘనత సాధించడం గర్వంగా ఉందని దేవల్‌ సంబురపడిపోతున్నారు.

1925లో అమెరికాలో నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలు ప్రారంభమైనప్పటి నుంచి.. పోటీల్లో ఇండో-అమెరికన్ల ఉత్తమ ప్రదర్శన కొనసాగుతోంది. పోటీల్లో అడిగే కఠినమైన ఆంగ్ల పదాల అక్షర క్రమాన్ని సరిగ్గా చెప్పే వారు విజేతలు అవుతారు. ఎనిమిదవ గ్రేడ్‌ లోపు విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనవచ్చు.  2020లో కరోనా కారణంగా పోటీ నిర్వహించలేదు.. తిరిగి 2021లో స్వల్ప మార్పులతో ఈ పోటీలు జరిగాయి.  ఇక కిందటి ఏడాది టెక్సాస్‌లో జరిగిన పోటీల్లో హరిణి లోగన్ విజేతగా నిలిచింది. మరో భారత అమెరికన్ విక్రమ్ రాజుపై ఆమె గెలుపొందింది. 

ఇదీ చదవండి: డేంజర్‌బెల్స్‌.. ఎటు చూసినా రెడ్‌ సిగ్నల్స్‌

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top