భూమికి డేంజర్‌ బెల్స్‌.. ఎటు చూసినా రెడ్‌ సిగ్నళ్లే | Sakshi
Sakshi News home page

భూమికి డేంజర్‌ బెల్స్‌.. ఎటు చూసినా రెడ్‌ సిగ్నళ్లే

Published Fri, Jun 2 2023 4:54 AM

Earth Commission Releases First Major Study Quantifying Earth System Boundaries - Sakshi

భూమి ఎదుర్కొటున్న ప్రధాన సమస్యలు, వాటికి కారణాలు తదితరాలపై 40 మంది ప్రముఖ అంతర్జాతీయ ప్రకృతి, సామాజిక శాస్త్రవేత్తలతో కూడిన ఎర్త్‌ కమిషన్‌ బృందం తాజాగా అధ్యయనం నిర్వహించింది. అందులో తేలిన ఆందోళనకర అంశాలతో కూడిన నివేదిక జర్నల్‌ నేచర్‌లో పబ్లిషైంది. మానవ ఆధిపత్య యుగం (ఆంత్రోపొసీన్‌) క్రమంగా భూమి తాలూకు కీలక వ్యవస్థల స్థిరత్వాన్ని సమూలంగా కదిలించి వేస్తోందని హెచ్చరించింది. నివేదికలో వెల్లడించిన అంశాలు ఒళ్లు జలదరించేలా ఉన్నాయి...

మితిమీరిన వనరుల దోపిడీ. లెక్కలేని నిర్లక్ష్యం. ఇంకా అనేకానేక స్వయంకృతాపరాధాలతో భూమిని చేజేతులారా నాశనం చేసుకుంటున్నాం. పుట్టింది మొదలు గిట్టి మట్టిలో కలిసేదాకా నిత్యం సకలం సమకూర్చే ఆధారాన్నే మొదలంటా నరికేసుకుంటున్నాం. భావి తరాలనే గాక భూమిపై ఉన్న సకల జీవరాశులనూ పెను ప్రమాదపుటంచుల్లోకి నెడుతున్నాం. గ్లోబల్‌ వార్మింగ్, కరువు, పెను వరదల వంటి ఉత్పాతాల రూపంలో భూమి చేస్తున్న ఆక్రందనను ఇకనైనా చెవిన పెట్టకపోతే పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయేందుకు ఇంకెంతో కాలం పట్టదని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నా పట్టించుకునే తీరిక ఎవరికీ లేదు. ఫలితంగా భూమికి డేంజర్‌ బెల్స్‌ చెవులు బద్దలయ్యే స్థాయిలో మోగుతున్నాయని సైంటిస్టులు తాజాగా తేల్చారు. భూమి తాలూకు ఎనిమిది రకాల భద్రతా పరిమితుల్లో ఏకంగా ఏడింటిని ఎప్పుడో దాటేశామని వారు వెల్లడించారు...

ప్రతి ఖండంలోనూ..
సమతుల్యత పూర్తిగా దెబ్బ తిని అతి సమస్యాత్మకంగా మారిన పలు ప్రాంతాలను అధ్యయనంలో భాగంగా పరిశోధక బృందం గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఖండంలోనూ ఎక్కడపడితే అక్కడ ఇలాంటి హాట్‌స్పాట్లు ఉండటం కలవరపరిచే అంశమేనని సైంటిస్టులు చెబుతున్నారు. వీటిలో చాలా ప్రాంతాల్లో వాతావరణ మార్పులే సమస్యకు ప్రధాన కారణమని తేలింది. ‘‘ముఖ్యంగా ఆసియాలో పర్వత ప్రాంతాలతో సమాహారమైన హై మౌంటేన్‌ క్రయోస్పియర్‌ శరవేగంగా మార్పుచేర్పులకు లోనవుతోంది. హిమానీ నదాల కరుగుదల మొదలుకుని జరగకూడని ప్రతికూల పరిణామాలన్నీ భయపెట్టే వేగంతో చోటు చేసుకుంటున్నాయి. ఫలితంగా అతి త్వరగా ఆ ప్రాంతమంతా సామాజికంగా, ఆర్థికంగా పెను కుదుపులకు లోనవడం ఖాయం’’ అని సహ అధ్యయనకర్త ప్రొఫెసర్‌ క్రిస్టీ ఎబి హెచ్చరించారు.

ఎటు చూసినా రెడ్‌ సిగ్నళ్లే...
భూమి భద్రతకు సంబంధించి స్థూలంగా 8 రకాల సూచీలను కీలకంగా పర్యావరణవేత్తలు పరిగణిస్తారు. వీటిలో మూడు కంటే ఎక్కువ సూచీలు ఆమోదిత పరిమితి దాటితే భూమికి ముప్పు తప్పదని భావిస్తారు. కానీ ఇప్పుడు ఏకంగా 7 సూచీలు ఆమోదిత పరిమితిని ఎప్పుడో దాటేసి ప్రమాదకర స్థాయికి చేరుతున్నట్టు ఎర్త్‌ కమిషన్‌ అధ్యయనం తేల్చడం అందరినీ భయపెడుతోంది... 

ఏం చేయాలి
► పర్యావరణపరంగా సురక్షిత స్థాయిని భూమి ఎప్పుడో దాటేసింది. రోజురోజుకూ మరింత ప్రమాదం దిశగా వెళ్తోంది.
► భూమిపై వాసయోగ్యతను నిర్ధారించే జీవ భౌతిక వ్యవస్థలన్నింటినీ చక్కదిద్దే పని తక్షణం మొదలు పెట్టాలి.
► అప్పుడు బొగ్గు, చమురు, సహజ వాయువు వంటి కీలక వనరుల లోటును భూమి తనంత తానుగా భర్తీ చేసుకోగలదు.


‘‘భూమికి గనక మనిషికి చేసినట్టే ఇప్పటికిప్పుడు వార్షిక హెల్త్‌ చెకప్‌ చేయిస్తే ఆరోగ్యం పూర్తిగా దిగజారిపోయిందంటూ రిపోర్టు వస్తుంది. కీలక అవయవాలన్నీ దాదాపుగా మూలకు పడుతున్నాయని తేలుతుంది’’
– క్రిస్టీ ఎబి, సహ అధ్యయనకర్త, యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌లో క్లైమేట్‌ అండ్‌ పబ్లిక్‌ హెల్త్‌ ప్రొఫెసర్‌  

‘‘భూ స్థిరత్వాన్ని ఆమోదనీయ స్థాయికి తీసుకొచ్చేందుకు దేశాలన్నీ కలసికట్టుగా తక్షణం ఓ భారీ ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం చాలా ఉంది. లేదంటే భూమి ఏమాత్రమూ ఆవాసయోగ్యం కాకుండా పోయేందుకు ఇంకెంతో కాలం పట్టదు!’’
– ప్రొఫెసర్‌ జొయీతా గుప్తా, అధ్యయనంలో కీలక భాగస్వామి

డేంజర్‌ హాట్‌ స్పాట్స్‌కు నిలయాలు
► తూర్పు యూరప్‌
► దక్షిణాసియా మధ్యప్రాచ్యం
► ఆగ్నేయాసియా
► ఆఫ్రికాలో పలు ప్రాంతాలు
► బ్రెజిల్‌లో చాలా ప్రాంతాలు
► అమెరికాలో పలు ప్రాంతాలు
► మెక్సికో చైనా


కొసమెరుపు: సూచనల మాటెలా ఉన్నా కీలకమైన అన్ని మౌలిక సూచికలూ పూర్తిగా నేల చూపులు చూస్తున్నాయి. కనుక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వనరుల భర్తీ దేవుడెరుగు, భూమి తాలూకు వాసయోగ్యతకే, మరోలా చెప్పాలంటే జీవరాశుల ఉనికికే ఎసరొచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందన్నది సైంటిస్టులు ముక్త కంఠంతో చెబుతున్న మాట!
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
 
Advertisement