
యెమెన్‌లో మలయాళీ నర్సు నిమిషా ప్రియ(Nimisha Priya) కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. తలాల్ అబ్దో మెహ్దీ కుటుంబం.. క్షమాభిక్షకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌కు చెందిన మత పెద్దల జోక్యంతో నిమిష మరణశిక్ష తాత్కాలికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే చర్చల్లో సానుకూల పురోగతి కనిపించడం లేదని సమాచారం.
మృతుడు తలాల్ అబ్దో మెహ్దీ సోదరుడు అబ్దెల్‌ఫతాహ్ మెహ్దీ తాజా పరిణామాలపై స్పందించాడు. నిమిష చేసింది నేరమేనని, ఆమెకు శిక్ష పడాల్సిందే అని అంటున్నాడతను. అదే సమయంలో.. మీడియాలో నిమిషను బాధితురాలిగా చూపిస్తున్న తీరుపైనా అతను తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
‘‘నిమిష నా సోదరుడిని హతమార్చింది. కానీ, మీడియా మాత్రం ఒక నేరస్తురాలిని బాధితురాలిగా చూపిస్తూ కథనాలు ఇస్తోంది. అందులో ఎలాంటి వాస్తవం లేదు. ఆమె చేసింది ముమ్మాటికీ నేరమే. క్షమాభిక్షకు ఆమె అర్హురాలు కాదు. శిక్ష పడాల్సిందే’’ అని అబ్దెల్‌పతాహ్ అంటున్నాడు. ఇదిలా ఉంటే.. నిమిషకు క్షమాభిక్ష ప్రసాదించే విషయంలో తలాల్ కుటుంబంలో భేదాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మతపెద్దల జోక్యం చేసుకున్నట్లు సమాచారం.
షెడ్యూల్ ప్రకారం.. బుధవారమే నిమిషకు సనా జైలులో మరణశిక్ష అమలు కావాల్సి ఉంది. అయితే కేరళకు చెందిన ‘గ్రాండ్ ముఫ్తీ’, కాంతాపురం ఏపీ అబుబాకర్ ముస్లియార్, మరికొందరు మతపెద్దల చొరవతో చర్చలకు తలాల్ అబ్దో కుటుంబం ముందుకు వచ్చింది. దీంతో తదుపరి ఆదేశాలు ఇచ్చేంతదాకా యెమెన్ అధికారులు శిక్షను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ప్రకటించారు.

యెమెన్‌లో నిమిష తల్లి ప్రేమకుమారి
ఇదిలా ఉంటే.. మరోవైపు కేరళ సీపీఐ(ఎం) సెక్రటరీ ఎంవీ గోవిందన్ బుధవారం ఉదయం ముస్లియార్‌ను కలిసి.. చర్చలపై ఆరా తీశారు. ‘‘ఈ అంశం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. చర్చించాల్సిన అంశాలను ఇంకా చాలానే ఉన్నాయి. ఒకవైపు యెమెన్ అధికారులతో, మరోవైపు క్షమాభిక్ష కోసం బాధిత కుటుంబంతో చర్చలు జరుగుతున్నాయి అని ముస్లియార్ తెలిపారు’’ అని గోవిందన్ మీడియాకు వివరించారు.
తలాల్ కుటుంబం నిమిషను క్షమించి.. బ్లడ్‌మనీని అంగీకరిస్తేనే.. నిమిషకు శిక్ష తప్పుతుంది. ఆ తర్వాతే బ్లడ్‌మనీ సొమ్మును అందజేస్తారు. షరియా చట్టం ప్రకారం.. హత్య, తీవ్ర నేరాలు జరిగినప్పుడు బాధిత కుటుంబానికి చెల్లించేదే బ్లడ్‌మనీ(క్షమాధనం). నిమిష కేసులో కేరళకు చెందిన బిలియనీర్ ఎంఏ యూసఫ్ అవసరమైన ఆర్థిక సాయం అందిస్తానని ముందుకు రావడం గమనార్హం.
2008లో కేరళ నుంచి యెమెన్‌కు వెళ్లింది నిమిషా ప్రియా. ఆ తర్వాత తిరిగొచ్చి వివాహం చేసుకుని ఓ బిడ్డను జన్మనిచ్చింది. తిరిగి యెమెన్ వెళ్లిన ఆమె.. అక్కడ సొంత క్లినిక్ ప్రారంభించింది. అయితే తన వ్యాపారభాగస్వామి అయిన తలాల్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో తలాల్‌కు మత్తు మందు ఇచ్చి పాస్‌పోర్ట్‌ను లాక్కోవాలనే ప్రయత్నం చేసిందామె. అయితే అనూహ్యంగా మత్తుమందు డోస్ ఎక్కువై తలాల్ మరణించాడు. దీంతో మృతదేహాన్ని ఓ ట్యాంకర్‌లో పడేసి.. ఆమె పారిపోయే ప్రయత్నంలో దొరికిపోయింది.
ఈ కేసులో నిమిషా ప్రియకు 2020లో మరణశిక్ష పడగా.. ఆ దేశ సుప్రీం కోర్టు 2023లో శిక్షను సమర్థించింది. అయితే బాధిత కుటుంబంతో బ్లడ్‌మనీకి ఒప్పందం కుదుర్చుకునేందుకు కోర్టు వీలు కలిపించింది. కానీ, తలాల్ కుటుంబం ఎలాంటి సంప్రదింపులకు ముందుకు రాలేదు. ఇక శిక్ష అమలు తేదీని ప్రకటించిన నాటి నుంచి కేరళకు చెందిన రాజకీయ నేతలు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ విజ్ఞప్తులు చేస్తూ వచ్చారు. అయితే తాము చేయగలిగిందంతా చేశామని, హౌతీ ప్రభావిత యెమెన్‌తో భారత్‌కు దౌత్యపరంగా మంచి సంబంధాలేవీ లేవని, బ్లడ్‌మనీ అనేది పూర్తిగా ప్రైవేట్ వ్యవహారమని.. ఈ తరుణంలో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.