హాంకాంగ్ లో తెలుగు కుటుంబాలు నాలుగు దశాబ్దాలకు పైగా నివసిస్తూ తెలుగు భాషా, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో కృషి చేస్తున్నాయి. హాంకాంగ్‌లో నివసిస్తున్న తెలుగు కుటుంబాల ఐక్యత, భాషా-సాంస్కృతిక పరిరక్షణ లక్ష్యాలతో 1990ల చివరి దశలో ఆవిర్భవించిన ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య, 2013 నుంచి అధికారికంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ తెలుగు భాష, సాహిత్యం, కళలు, సంప్రదాయాల ప్రోత్సాహానికి అంకితభావంతో సేవలందిస్తోంది.
సమాఖ్య వ్యవస్థాపక సభ్యురాలు జయ పీసపాటి 2016 నుంచి సింగపూర్, హైదరాబాద్, కాకినాడ, మలేషియా, షాంఘై నగరాల్లో నిర్వహించిన ప్రపంచ తెలుగు సదస్సులు, సాహిత్య మహాసభల్లో చురుకుగా పాల్గొంటూ వస్తున్నారు. ఆమెకు ఇటీవల తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ హాంకాంగ్ చీఫ్ హానరరీ అడ్వైజర్ అండ్ కోఆర్డినేటర్గా గౌరవ బాధ్యతలు అప్పగించగా, ఆసియా పసిఫిక్ తెలుగు ఫెడరేషన్ (APTF) బోర్డులో వైస్ ప్రెసిడెంట్ (ఈస్ట్ ఏషియా) గా ఎన్నిక కావడం హాంగ్ కాంగ్ తెలుగు సమాజానికి గర్వకారణంగా నిలిచింది.
సదస్సులో భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు పంపిన అభినందన సందేశం విశేష ఆదరణ పొందింది. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ముఖ్యోపన్యాసం, ప్రముఖ సాహితీవేత్త డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ విశిష్ట ప్రసంగం పాల్గొన్న వారిని ఆకట్టుకున్నాయి. చైనాలో ఇంత విస్తృత స్థాయిలో తెలుగు సాహిత్య సదస్సును నిర్వహించడం చారిత్రాత్మక ఘట్టమని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు.
షాంఘైలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం తరఫున కాన్సుల్స్ స్నేహజ జొన్నలగడ్డ, రోహిత్ కోగంటి గౌరవ అతిథులుగా పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగించారు. చైనా గడ్డపై ఇటువంటి ప్రతిష్ఠాత్మక తెలుగు సాహిత్య సదస్సు నిర్వహించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన షాంఘై తెలుగు సంఘాన్ని అభినందించారు. నార్డ్ ఆంగ్లియా ఇంటర్నేషనల్ స్కూల్ తమ పాఠశాల ప్రాంగణాన్ని తెలుగు సింపోజియం నిర్వహణకు ఉదారంగా అందించినందుకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రిచర్డ్ థాంప్సన్ మాట్లాడుతూ, ఇటువంటి కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడం ఆనందంగా ఉందని అన్నారు.

ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు స్పందిస్తూ, ఈ ఏడాది తమ సభ్యులు సాహిత్య, సాంస్కృతిక విభాగాల్లో విశేషంగా పాల్గొనడం సంతోషకరమని పేర్కొన్నారు. ఆమె సదస్సు నిర్వహణ బృందంలో భాగస్వామిగా సేవలందించడమే కాకుండా, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తరఫున షాంఘై తెలుగు సంఘానికి "షాంఘైలో తొలి తెలుగు సింపోజియం నిర్వహించిన సంస్థ"గా ప్రపంచ రికార్డు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు.
సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రముఖ కూచిపూడి, ఆంధ్రనాట్యం, పెరిని నృత్య కళాకారుడు సంజయ్ వడపల్లి ఆంధ్రనాట్య ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు. అలాగే “భారతీయ శాస్త్రీయ నృత్య రీతులు -ఆధునిక పోకడలు” అనే అంశంపై పరిశోధనాత్మక పత్రాన్ని సమర్పించి సభికుల ప్రశంసలు అందుకున్నారు.
సదస్సు ప్రత్యక్ష కార్యక్రమాలకు అనుబంధంగా నిర్వహించిన ఆన్‌లైన్ జూమ్ సాహిత్య వేదిక ద్వారా ఆన్‌లైన్‌లో పాల్గొన్నఏకైక హాంగ్ కాంగ్ వక్త మౌక్తిక మంగిపూడి తన స్వీయ రచన కథను సదస్సులో పఠనం చేసారు . ఈ సందర్భంగా పలువురు ప్రముఖ రచయితలు, కవులు, పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించడంతో పాటు, నూతన గ్రంథాలను ఆవిష్కరించారు. సాహిత్య చర్చలు, కవితా వేదికలు, పుస్తకావిష్కరణలు సదస్సుకు మరింత ఆకర్షణ తీసుకొచ్చాయి.
ఇదీ చదవండి: ప్రముఖ సాహితీవేత్త డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హాంకాంగ్ పర్యటన


