ప్రముఖ సాహితీవేత్త డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హాంకాంగ్ పర్యటన | Dr yarlagadda lakshmi prasad hong kong visit literary meet On vijayadashami | Sakshi
Sakshi News home page

ప్రముఖ సాహితీవేత్త డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హాంకాంగ్ పర్యటన

Oct 25 2026 3:03 PM | Updated on Oct 25 2026 3:21 PM

Dr yarlagadda lakshmi prasad hong kong visit literary meet On vijayadashami

అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన రచయిత, విశ్వహిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ షాంఘైలో అక్టోబర్ 24, 25, 2026  తేదీలో హాంగ్‌కాంగ్‌లో పర్యటించారు. అక్కడ 10వ అంతర్జాతీయ తెలుగు సదస్సు జరగనున్న నేపథ్యంలో హంగ్‌కాంగ్‌కి చేరుకున్నారు. అక్కడ విమానాశ్రయంలో హాంకాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు జయ పీసపాటి, రవి పీసపాటి, క్రీడా కార్యదర్శి హరిన్ చక్రవర్తి, ప్రముఖ శాస్త్రీయ నృత్యకారుడు సంజయ్ వడపల్లి తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

ప్రవాస భారతీయులతో ఆత్మీయ సాహిత్య సమ్మేళనం
డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారితో ప్రత్యక్షంగా మమేకమయ్యే అవకాశాన్ని కల్పించేందుకు ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ప్రత్యేకంగా "ఆత్మీయ సమ్మేళనం"ను నిర్వహించింది. తెలుగు, హిందీ భాషల్లో విశేష సాహిత్య సేవలందించిన ఈ మహనీయునితో సంభాషించే అవకాశాన్ని స్థానిక భారతీయులు, సాహిత్యాభిమానులు ఆసక్తిగా సద్వినియోగం చేసుకున్నారు.

తెలుగు, హిందీ భాషల్లో సమాన ప్రావీణ్యంతో అద్భుతమైన వాక్పటిమ కనబరిచిన డా. లక్ష్మీప్రసాద్ తమ రచనా ప్రస్థానం, అనువాద అనుభవాలు, సాహిత్య ప్రయాణంలోని విశేషాలను హాస్యరసంతో మేళవించి పంచుకున్నారు. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి కుటుంబ నేపథ్యం కంటే కృషి, ప్రతిభ, పట్టుదల ముఖ్యమని యువతకు ప్రేరణాత్మక సందేశం అందించారు.

జ్ఞాపకాల పుటల నుంచి విశిష్ట అనుభవాలు
మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, నటుడు, రాజకీయ నాయకుడు ఎన్.టి. రామారావు, ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు, కవి హరివంశ్‌రాయ్ బచ్చన్ తదితర మహనీయులతో తనకు కలిగిన అనుభవాలను ఆయన ఆసక్తికరంగా వివరించారు.

అనంతరం భాషా వైవిధ్యం, జాతుల మధ్య భాషా సంబంధాలు, సామాజిక సంభాషణల్లో భాష పాత్ర, తన రచనల్లోని పాత్రల రూపకల్పన వంటి అంశాలపై ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు ఆయన లోతైన విశ్లేషణతో సమాధానాలిచ్చారు.

కార్యక్రమం చివరలో ఈ ఏడాది అత్యుత్తమంగా నిర్వహించిన మూడు బతుకమ్మలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల సాంప్రదాయ వంటకాలతో ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారు.  

అలాగే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని హాంకాంగ్‌లోని చారిత్రాత్మక హిందూ దేవాలయంలో ఆయనకు ఘన సత్కారం నిర్వహించారు. హ్యాపీ వ్యాలీలో ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక దేవాలయంలో హిందూ అసోసియేషన్ అధ్యక్షులు, ట్రస్టీ లాల్ హర్దసానీ ఆయనను సన్మానించారు. ఈ నేపథ్యంలో డా. లక్ష్మీప్రసాద్ దేవాలయ గ్రంథాలయానికి తన రచనలతో కూడిన కొన్ని పుస్తకాలను బహుమతిగా అందజేశారు.

చివరగా ఆయన ప్రవాస భారతీయులతో కలిసి విజయదశమి ఉత్సవాల్లో పాల్గొనడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. కాగా, ఈ ఉత్సవాలు భారతీయ సంస్కృతి, భక్తి, సామాజిక ఐక్యతకు ప్రతీకలుగా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. అలాగే డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హాంకాంగ్ పర్యటన తెలుగు సమాఖ్య చరిత్రలో చిరస్మరణీయమైన అధ్యాయంగా నిలిచిపోతుందని అన్నారు సమాఖ్య సభ్యులు. 

ఇదీ చదవండి: బెర్న్‌ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement