మోపాల్: మండలంలోని కాల్‌పోల్ తండాకు చెందిన బస్సీ అనవి బాయి (52) వైద్యం వికటించి మృతిచెందినట్లు గ్రామస్తులు తెలిపారు. అనవి బాయికి ఇటీవల జ్వరం రావడంతో భర్త మోహన్‌తో కలిసి మంచిప్పలోని ఓ ప్రయివేటు వైద్యుడి(ఆర్‌ఎంపీ)ని సంప్రదించారు. ఆమెను పరీక్షించిన వైద్యుడు సైలెన్‌తోపాటు పలు ఇంజక్షన్లు ఇచ్చాడు. ఐదు నిమిషాల వ్యవధిలోనే ఆమె పరిస్థితి విషమంగా మారి, స్ఫృహ కోల్పోయింది. వెంటనే ప్రయివేటు వాహనం (ఓమినీ)లో అనవిబాయిని నగరంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించగా, అప్పటికే మృతిచెందిందని నిర్ధారించారు. మంచిప్పలో వైద్యుడి కారణంగానే అనవిబాయి మృతిచెందిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న సదరు వైద్యుడు అప్పటి నుంచి అందుబాటులో లేడని పేర్కొంటున్నారు. ఆస్పత్రిసైతం మూసి ఉంచినట్లు సమాచారం.
కోచింగ్ గడువు పెంచాలి
ఖలీల్‌వాడి: జిల్లా కేంద్రంలోని ఎస్సీ స్టడీ సర్కిల్ కోచింగ్ గడువు పొడగించాలని అభ్యర్థులు కోరారు. ఈమేరకు వారు శుక్రవారం ఎస్సీ ఉపసంచాలకులు రజితకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రస్తుత నోటిఫికేషన్లతోపాటు రానున్న రోజులలో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు రాబోతున్నాయని, ఇలాంటి కీలకమైన సమయంలో మేము ఇంటికి వెళ్లి చదవలేమని, ప్రయివేట్ హాస్టల్‌లో ఉండి చదువుకునే ఆర్థిక స్థోమత లేదన్నారు. కొంతమంది అభ్యర్థులకు తల్లిదండ్రులు లేరని, ఈ 5నెలల ఉచిత శిక్షణ పునాది లాంటిదని అభ్యర్థులు తెలిపారు. నోటిఫికేషన్ సమయంలో అంతరాయం కలగకుండా ఎస్సీ స్టడీ సర్కిల్ అభ్యర్థులకు కోచింగ్ కంటిన్యూ చేయాలని కోరారు.


