మోటార్ పంపుసెట్ల చోరీ
కమ్మర్‌పల్లి: ఉప్లూర్ కాకతీయ కాలువ పరిధిలోని వ్యవసాయ మోటార్ పంపుసెట్లు చోరీకి గురయ్యాయి. సోమవారం అర్ధరాత్రి దుండగులు కాకతీయ కాలువ కట్ట వద్ద ఉన్న మోటార్ పంపుసెట్లకు బిగించి ఉన్న విద్యుత్ తీగలను కత్తిరించి, కాలువలో ఉన్న పైపులను కోసి మోటారు పంపుసెట్లను ఎత్తుకెళ్లారు. రైతులు రేగుంట దేవేందర్, బద్దం మోహన్‌రెడ్డి, జిందం అంబరీష్, డబ్బ చిన్న భూమన్న మంగళవారం ఉదయం పంటకు నీరు పెట్టేందుకు వెళ్లగా, మోటారు పంపుసెట్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. వాటి విలువ రూ. 40 వేలు ఉంటుందని రైతులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
ట్రాన్స్‌ఫార్మర్ ఆయిల్..
వర్ని: మండలంలోని సత్యనారాయణపురం గ్రామ శివారులోగల పొలాల వద్ద ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ నుంచి సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 100 లీటర్ల ఆయిల్ చోరీకి పాల్పడినట్లు మండల విద్యుత్ శాఖ ఏఈ బాలకిషన్ తెలిపారు. ఈ విషయమై వర్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఏఈ తెలిపారు.
విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి
వర్ని: మండలంలోని మల్లారం గ్రామంలో కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన మాజీద్ (28) మంగళవారం ఉదయం ఇంట్లో కరెంటు రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే స్థానికులు అతడిని వర్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. వైద్యులు సకాలంలో స్పందించకపోవడంతోనే అతడు మృతి చెందినట్లు గ్రామస్తులు ఆరోపిస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు.
దరఖాస్తుల ఆహ్వానం
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వేణుగోపాల స్వామి ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ (ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ మీడియం), బీకాం కంప్యూటర్స్, బీఎస్సీ హెల్త్ కేర్స్, బీఎస్సీ లైఫ్ సైన్సు, బీఎస్సీ ఫిజికల్ సైన్సులో సీట్లు ఉన్నాయన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 24, 25 తేదీల్లో నిర్వహించే స్పాట్ అడ్మిషన్స్‌కు హాజరుకావాలని కోరారు.


