కలగానే డిగ్రీ కాలేజీ నిర్మాణం | - | Sakshi
Sakshi News home page

కలగానే డిగ్రీ కాలేజీ నిర్మాణం

Sep 7 2026 7:51 AM | Updated on Sep 7 2026 7:51 AM

ఇందల్వాయి: మండలంలోని పేద గిరిజన విద్యార్థినులకు సొంత మండలంలో డిగ్రీ చదువు కలగానే మిగిలిపోతోంది. మహిళా డిగ్రీ కళాశాల భవన నిర్మాణం కోసం స్థల సేకరణ పూర్తయినా పనులు ప్రారంభం కాలేదు. గిరిజనుల వినతి మేరకు 2019లో అప్పటి ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ గిరిజన మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు గన్నారం గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన స్థల సేకరణ చేయించారు. ఆ తరువాత కరోనా పరిస్థితుల కారణంగా కాలేజీ ఏర్పాటు ప్రక్రియ పూర్తిస్థాయిలో ముందుకు సాగలేదు. దీంతో కాలేజీని జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతానికి తరలించి తరగతులు అక్కడ నిర్వహిస్తున్నారు.

భూ నిర్వాసితులకు పరిహారమూ లేదు

మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటు కోసం గన్నారం శివారులోని 1186 సర్వే నంబరులో సుమారు ఏడెకరాల స్థలాన్ని సేకరించి తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ గర్‌ల్స్‌ రెసిడెన్షియల్‌ కాలేజీకి అప్పగించారు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు అక్కడ కనీసం ప్రహరీ కట్టడానికి కూడా నిధులు మంజూరు కాలేదు. భూ నిర్వాసితులకు నయా పైసా పరిహారం, పునరావాసం దక్కలేదని కుంట రవీందర్‌, సాకలి సిద్ధయ్య తెలిపారు.

విద్యార్థులకు తప్పని ఇబ్బందులు

కాలేజీ నిర్మాణంలో తీవ్ర జాప్యం కారణంగా ఉన్నత చదువుల కోసం గిరిజన బాలికలు పక్క మండలాలకో, జిల్లా కేంద్రానికో వెళ్తూ ఇబ్బందులు పడుతున్నారు. తమ సమయం అంతా ప్రయాణానికి సరిపోతోందని, చదువుకోవడానికి సమయం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు స్పందించి మహిళా డిగ్రీ కాలేజీ నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.

వెంటనే భవనాన్ని నిర్మించాలి

మండలంలో 10 గిరిజన గ్రామాలు ఉన్నాయి. అందులో వందల మంది గిరిజన బాలికలు ఉన్నత చదువులు చదవాలనుకుంటున్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం సేకరించిన స్థలంలో అధునాతన సౌకర్యాలతో డిగ్రీ కాలేజీ నిర్మాణం చేపట్టాలి. వెంటనే నిధులు విడుదల చేయాలి. – రమావత్‌ మోహన్‌నాయక్‌, గుట్టకింది తండా

పరిహారం అందించాలి

డిగ్రీ కాలేజీ కోసం మా నాలుగు ఎకరాలతోపాటు మా గ్రామానికి చెందిన సాకలి సిద్ధయ్యకు చెందిన సుమారు ఏడు ఎకరాల వరకు భూమిని సేకరించా రు. మొదట్లో పరిహారం వస్తుందని అధికారులు చె ప్పినా ఇప్పటివరకు అందలేదు. మా బాధలను ప్రభుత్వం అర్థం చేసుకొని తగిన న్యాయం చేయాలి. – కుంట రవీందర్‌, భూ నిర్వాసితుడు, గన్నారం

స్థల సేకరణ పూర్తయి ఆరేళ్లు..

ప్రారంభం కాని పనులు

పక్క మండలాలకు వెళ్తున్న ఇందల్వాయి మండల గిరిజన విద్యార్థులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement