కామారెడ్డి టౌన్ : కాంగ్రెస్ ప్రభుత్వం దళితులకు తీవ్ర అన్యాయం చేస్తోందని ఎంఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ విమర్శించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దళితబంధు స్థానంలో తెస్తామన్న అంబేడ్కర్ అభయహస్తం కింద రూ.12 లక్షల ఆర్థిక సాయాన్ని 12 మందికై నా ఇచ్చారా అని ప్రశ్నించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.12 లక్షలు అందించాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్‌లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మహాదీక్ష చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరు వెంకటేశ్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కొత్తూరి సాయిలు, నాయకులు దుబ్బాక లక్ష్మీనారాయణ, దామెర రాజేశ్, స్వామి, నారాయణ, రవి తదితరులు పాల్గొన్నారు.


