పోచారంపై చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పోచారంపై చర్యలు తీసుకోవాలి

Aug 21 2026 9:38 AM | Updated on Aug 21 2026 9:38 AM

బాన్సువాడ కాంగ్రెస్‌ నేతల డిమాండ్‌

నిజామాబాద్‌ రూరల్‌ : ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ బాన్సువాడకు చెందిన కాంగ్రెస్‌ నేతలు ఆందోళనకు దిగారు. నిజామాబాద్‌ జిల్లాకేంద్రంలోని దుబ్బ ప్రాంతంలోగల ఎంకే గార్డెన్‌లో బుధవారం కాంగ్రెస్‌ పార్టీ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. పీసీసీ చీఫ్‌ బొమ్మ మహేష్‌కుమార్‌ గౌడ్‌, ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం హాలు బయట బాన్సువాడకు చెందిన పలువురు కాంగ్రెస్‌ నాయకులు నిరసనకు దిగారు. పోచారం శ్రీనివాసరెడ్డి నిర్ణయాల వల్ల సీనియర్‌లకు అన్యాయం జరుగుతోందన్నారు. పార్టీకి నష్టం చేస్తున్న పోచారంపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలని కోరారు.

ఇన్‌చార్జి మంత్రిని

కలిసిన కలెక్టర్‌

నిజామాబాద్‌ అర్బన్‌: నిజామాబాద్‌ నగరంలో పర్యటించిన జిల్లా ఇన్‌చార్జి మంత్రి డి అనసూయ (సీతక్క)ను కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా బుధవారం ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌజ్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రితోపాటు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ షబ్బీర్‌ అలీకి కలెక్టర్‌ పూల మొక్కలు అందజేశారు. ఇద్దరితో కొంతసేపు భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. కలెక్టర్‌ వెంట నిజామాబాద్‌ ఆర్డీవో రాజేంద్రకుమార్‌ తదితరులు ఉన్నారు.

అదనపు కలెక్టర్‌గా రాజాగౌడ్‌

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లా అదనపు కలెక్టర్‌గా(రెవెన్యూ) రాజాగౌడ్‌ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు అదనపు కలెక్టర్‌గా (రెవెన్యూ) పనిచేసిన కిరణ్‌కుమార్‌ పదవీవిరమణ చేయగా, ఆయన స్థానంలో జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్‌గా (స్థానిక సంస్థలు) పనిచేస్తున్న రాజాగౌడ్‌ రానున్నారు. రాజాగౌడ్‌ గతంలో బోధన్‌, ఆర్మూర్‌ ఆర్డీవోగా పని చేశారు.

రైతులకు మెరుగైన సేవలందించాలి

నందిపేట్‌(ఆర్మూర్‌): రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వ్యాపారాన్ని మరింత విస్తరించాలని రాష్ట్ర కో ఆపరేటీవ్‌ అపెక్స్‌ బ్యాంకు అధికారిణి లావణ్య సూచించారు. మండలంలోని చింరాజ్‌పల్లి ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘంతో పాటు కుద్వాన్‌పూర్‌ సొసైటీ పరిధిలోని వన్నెల్‌ కే సహకార బ్యాంకును బుధవారం సందర్శించారు. ముందుగా చింరాజ్‌పల్లి సొసైటీ కార్యకలాపాలు, వ్యాపార పురోగతి, రైతులకు అందిస్తున్న రుణాల వివరాలను కార్యదర్శి పిస్క నారాయణతో మాట్లాడి తెలుసుకున్నారు. సొసైటీ లాభాల బాటలో నడిపిస్తున్నారని సిబ్బందిని అభినందించారు. అనంతరం వన్నెల్‌ కే గ్రామంలోని సహకార బ్యాంకును సందర్శించి ఆవరణలో మొక్కలు నాటారు. ఏజీఎం సుమన్‌, బ్రాంచ్‌ మేనేజర్‌ శ్రీలత, మనీశ్‌, కుద్వాన్‌పూర్‌ సొసైటీ కార్యదర్శి చిన్నయ్య, సొసైటీ, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement