● ఫిలిప్పీన్స్ మైగ్రేషన్ పాలసీపై తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ అధ్యయనం
● పర్యటనలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే భూపతిరెడ్డి
డిచ్‌పల్లి(నిజామాబాద్‌రూరల్): ప్రపంచంలోనే మె రుగైన వలస విధానం అమలు చేస్తున్న ఫిలిప్పీన్స్ దేశంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ మూడు రోజుల స్టడీ టూర్ చేపట్టింది. తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వలస వెళ్లిన సుమారు 15 లక్షల మంది కార్మికుల సంక్షేమానికి సమగ్ర విధానం రూపొందించేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి తెలిపారు.
స్టడీ టూర్‌లో భాగంగా ఫిలిప్పీన్స్ దేశ రాజధా ని మనీలా నగరంలో బుధవారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ బృందం పాల్గొంది. ఫిలిప్పీన్స్ లేబర్ మైగ్రేషన్, సివిల్ సొసైటీ సంస్థల స్పందన, లేబర్ మైగ్రేషన్ గవర్నెన్స్, అంతర్జాతీయ కార్మిక సంఘాల విధానాలు, గ్లోబల్ మైగ్రేషన్ యాక్షన్ ప్లాన్, లేబర్ మైగ్రేషన్ కారిడార్ల అనుభవాలు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ గల్ఫ్ ఎన్నారై పాలసీని రూపొందించడంతో పాటు ‘గల్ఫ్ అండ్ అదర్ ఓవర్సీస్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు’ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆది శ్రీనివాస్, భూపతిరెడ్డి పేర్కొన్నారు.
ఉన్నతస్థాయి అధికారులతో భేటీ
స్టడీ టూర్‌లో భాగంగా బుధవారం తెలంగాణ ఎన్నారై అడ్వైజరీ కమిటీ సభ్యులు మనీలాలోని ఇండియన్ ఎంబసీని సందర్శించారు. భారత రాయబారి హర్ష్‌కుమార్ జైన్, ఫస్ట్ సెక్రటరీ నీలేష్ కుమార్ రాయ్‌లతో వలస కార్మికుల సంక్షేమం, వలస విధానాలు, విదేశాల్లో భారతీయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు.అనంతరం కమిషన్ ఆన్ ఫిలిప్పీన్స్ ఓవర్సీస్ ఉన్నతాధికారులతో కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. పర్యటనలో తెలంగాణ రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ చైర్మన్ అంబాసిడర్ డాక్టర్ బీఎం వినోద్ కుమార్, వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, సభ్యులు సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, నంగి దేవేందర్, స్వదేశ్ పరికిపండ్ల, ప్రొఫెసర్లు విజయ్ కొర్ర, జునుగూరు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


