న్యూస్‌రీల్
నిజామాబాద్
శుక్రవారం శ్రీ 21 శ్రీ ఆగస్టు శ్రీ 2026
డొంకేశ్వర్(ఆర్మూర్): రైతు కుటుంబాలకు ఇన్నాళ్లూ ధీమాగా నిలిచిన ‘రైతు బీమా’ పథకం అమలుపై సందిగ్ధం నెలకొంది. ఈ పథకానికి సంబంధించి ఈ ఏడాది ఎల్‌ఐసీకి చెల్లించాల్సిన ప్రీమియం సొమ్ము ను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదు. దీంతో ఆగస్టు 13వ తేదీలోపు మరణించిన రైతు కుటుంబాలకు మాత్రమే పాత విధానం ప్రకారం బీమా డబ్బులు అందనున్నాయి. అయితే, ఆగస్టు 13 తర్వాత మరణించిన రైతుల కుటుంబాల పరిస్థితి ఏంటన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ప్రీమియం చెల్లింపులు ఆగిపోవడంతో ఆయా కుటుంబాలకు పరిహారం అందుతుందా? లేదా? అన్నదానిపై అనిశ్చితి, గందరగోళం నెలకొంది. గడిచిన వారం రోజుల్లో జిల్లాలో పలువురు రైతులు మరణించినట్లుగా వ్యవసాయాధికారులకు సమాచారం రావడంతో వారి దరఖాస్తులను తీసుకోవాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారు. రైతు బీమా పథకం 2018 ఆ గస్టులో అప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 18–59 సంవత్సరాల మధ్య వయసు గల రైతులు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేసింది. గడిచిన ఎనిమిదేళ్లలో జిల్లాలో 8,160 మంది రైతులు మరణించగా, రూ.408 కోట్లు ప్రభుత్వం చెల్లించింది.
అందరికీ వర్తించేలా ఇందిరమ్మ బీమా!
రైతు బీమా పథకం రెన్యువల్‌పై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అన్నదాతల్లో
ఆందోళన మొదలైంది. అకాల మరణంతో పెద్ద దిక్కు దూరమైన కుటుంబానికి భరోసాగా నిలిచిన ఈ పథకానికి బ్రేక్ పడిందా? అనే సందేహం నెలకొంది. కాగా, రైతులతోపాటు సామాన్య కుటుంబాలకు బీమా వర్తించేలా ‘ఇందిరమ్మ బీమా’ పథకాన్ని అమలు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎలాంటి సమాచారం లేదు
ఆగస్టు 13 తర్వాత మరణించిన రైతులకు బీమా డ బ్బులు అందించే విషయంపై మాకు ఎలాంటి సమాచారం లేదు. దరఖాస్తులు తీసుకునే అంశంపై రాష్ట్ర శాఖ నుంచి కూడా ఎలాంటి ఆదేశాలు రాలేదు. కొత్త పథకం వివరాలను ప్రభుత్వమే ప్రకటిస్తుంది. – వీరాస్వామి, జిల్లా వ్యవసాయాధికారి
రైతు బీమా స్థానంలో సామాన్య ప్రజలు, రైతులకు వర్తించేలా రాష్ట్ర ప్రభుత్వం ‘ఇందిరమ్మ బీమా’ పథకాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి నవంబర్ నెలలో ముహూర్తం పెట్టినట్లుగా అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ కొత్త పథకం అమలు తీరుతెన్నులపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు. రేషన్‌కార్డు కలిగిన ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ బీమా పథకం ద్వారా ఇంటి పెద్ద మరణిస్తే రూ.5 లక్షలు ఇస్తారనే చర్చ మాత్రం జరుగుతోంది.
ప్రీమియం చెల్లింపులు నిలిపివేసిన
రాష్ట్ర ప్రభుత్వం
ఆగస్టు 13లోపు మరణించిన
రైతు కుటుంబాలకే ఆర్థిక సాయం
ఆ తర్వాత చనిపోతే పరిస్థితి ఏంటో తెలియని వైనం


