గ్రామాల్లో జీవవైవిధ్య కమిటీలు | - | Sakshi
Sakshi News home page

గ్రామాల్లో జీవవైవిధ్య కమిటీలు

Aug 16 2026 6:21 AM | Updated on Aug 16 2026 6:21 AM

ఏడుగురు సభ్యులతో

ఏర్పాటు చేస్తున్న అధికారులు

జీవ వనరుల సంరక్షణ కోసం చర్యలు

గ్రామ సర్పంచే కమిటీకి చైర్మన్‌

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌): ప్రకృతి ప్రసాదించిన జీవ సంపదను కాపాడుకునేందుకు గ్రామ పంచాయతీల్లో ‘జీవ వైవిధ్య యాజమాన్య కమిటీ’లు ఏర్పాటవుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు జిల్లా వ్యాప్తంగా 545 గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీలో సర్పంచ్‌ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. జీవ వనరుల సంరక్షణతోపాటు వాటిని భవిష్యత్‌ తరాల కోసం సుస్థిరంగా వినియోగించుకునేలా చూసే పూర్తి బాధ్యత ఈ కమిటీలకే అప్పగించారు. జీవవైవిధ్య యాజమాన్య కమిటీ చట్టాన్ని 2002 సంవత్సరంలో చేయగా, 2004లో దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. దీనిని మళ్లీ 2023లో సవరించారు. ఏడుగురు సభ్యుల్లో సర్పంచ్‌ చైర్మన్‌గా, జీపీ సెక్రెటరీ సభ్య కార్యదర్శిగా ఉంటారు. సభ్యులుగా ఇద్దరు మహిళలు, మిగతా ముగ్గురు సభ్యుల్లో ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారు ఉంటారు. ఐదేళ్ల కాలపరిమితి కలిగిన ఈ కమిటీ ప్రతి మూడు నెలలకోసారి సమావేశం నిర్వహిస్తుంది. ప్రభుత్వం నుంచి కొంత నిధులు కూడా కేటాయిస్తారు.

కమిటీ ప్రధాన విధులు, బాధ్యతలు...

● సహజ వనరులు, వనమూలికలు, వన్యప్రాణులు, పక్షులను కాపాడుకుంటూ ప్రకృతికి నష్టం కలగకుండా చూసుకోవాలి. జీవ సంపదను అక్రమంగా తరలించడం, దుర్వినియోగం చేస్తే వెంటనే అడ్డుకోవాలి.

● వాణిజ్య, వ్యాపార ప్రయోజనాల కోసం స్థానిక జీవ వనరులు సేకరించే వివిధ సంస్థల నుంచి నిబంధనల ప్రకారం ఫీజులు వసూలు చేసే అధికారం ఉంటుంది.

● స్థానిక వనమూలికలు, జీవ వనరులను ఉపయోగిస్తూ వైద్యం చేసే నాటు వైద్యుల వివరాలను సేకరించి పెట్టుకోవాలి.

● మంజూరైన జీవ వనరులు, సంప్రదాయక పరిజ్ఞానం, వసూలైన ఫీజులు, వాటి ద్వారా లభించిన ప్రయోజనాల పంపిణీ వివరాలతో కూడిక ప్రత్యేక రిజిస్టర్లను పక్కాగా నిర్వహించాలి.

● జాతీయ, రాష్ట్ర జీవవైవిధ్య మండలి అందించే మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహారాలను అమలు పరుస్తూ, స్థానిక జీవవైవిద్య నిధిని ఏర్పాటు చేసి పర్యవేక్షించాలి.

● వివిధ ప్రత్యేక సందర్భాలలో జీవవైవిధ్య అంశాలపై నేరుగా రాష్ట్ర జీవవైవిధ్య మండలికి, జాతీయ ప్రాధికార సంస్థకు ఈ కమిటీలు తమ నివేదికలు, అభిప్రాయాలను సమర్పించవచ్చు.

ఏఐ సాయంతో రూపొందించిన ప్రతీకాత్మక చిత్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement