బోధన్: దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర సైనికులతోపాటు వీరసైనికుల త్యాగాల విశిష్టతపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన అక్షరయాన్ కవయిత్రుల బృందం అధినేత్రి అయినంపూడి శ్రీలక్ష్మి నేతృత్వంలో మూడు భాషలతో ఒకే పుస్తకంలో ముద్రించిన సలాం సైనికా కవితా సంకలనాన్ని శనివారం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లోని పోలీసు అమరవీరుల స్తూపం వద్ద ఆవిష్కరించారు. 25 మందితో కూడిన అక్షరయాన్ కవయిత్రుల బృందంలో బోధన్‌కు చెందిన ప్రముఖ కవయిత్రి కాట్రగడ్డ భారతి ఉన్నారు. మొదట తెలుగు భాషలో కవితా సంకలనాన్ని ముద్రించామని, కార్గిల్ దివస్ రోజు నిర్వహించిన కార్యక్రమంలో కవితలు వినిపించగా, ఆర్మీ మేజర్ శ్రీనివాస్ తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లిష్ భాషల్లో కవితా సంకలనం తీసుకొస్తే అన్ని సైనిక్ స్కూల్స్, సైనికులకు అందిస్తామని తెలిపినట్లు భారతి పేర్కొన్నారు. అధికారుల కోరిక మేరకు తెలుగు నుంచి హిందీ, ఇంగ్లిష్ భాషల్లో కవితలను అనువదించినట్లు తెలిపారు. 80 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్మీ అధికారులతో కలిసి పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు.


