డిచ్‌పల్లి: నేషనల్ హైవే 44 వెంబడి డిచ్‌పల్లి, ఇందల్వాయి, జక్రాన్‌పల్లి పరిధిలో వ్యాపారులు హోటళ్లు, దాబాల యాజమానులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఏసీపీ ప్రకాశ్ సూచించారు. డిచ్‌పల్లిలోని కేఎన్‌ఆర్ గార్డెన్‌లో సోమవారం మూడు మండలాల వ్యాపారులు, ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీతో కలిసి ఏసీపీ ప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రోడ్డు భద్రత, ఇష్టారాజ్యంగా పార్కింగ్, లిక్కర్ అమ్మకం, గంజాయి వాడకం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అత్యవసరంలో సీసీ కెమెరాలు ఉంటేనే విచారణ వేగవంతంగా కొనసాగుతుందన్నారు. ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. డిచ్‌పల్లి సీఐ వినోద్, ఎస్సైలు ఆరిఫ్, మహేశ్, సుమలత, ఐఆర్‌ఏడీ మేనేజర్ వర్ష, తదితరులు పాల్గొన్నారు.


