తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో త్వరలోనే జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యెండల ప్రదీప్ పేర్కొన్నారు. ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ ఆవరణలో తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల సంఘం రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. యెండల ప్రదీప్ మాట్లాడుతూ.. ఉద్యమకారులకు 250 గజాలతో పాటు కేటగిరి వైజ్‌గా రూ.25 వేల నుంచి రూ.50వేల వరకు పెన్షన్ ఇవ్వాలని తీర్మానించారు. అలాగే తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, విద్యార్థుల అర్హతలను బట్టి ప్రభుత్వ జీవో ద్వారా పర్మినెంట్ ఉద్యోగాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యార్థి ఉద్యమకారులకు యూనివర్సిటీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, వివిధ రంగాల్లో ఉద్యమకారుల కోటా ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విద్యార్థి ఉద్యమకారుల సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పిడమర్తి రవి, నాయకులు సాంబశివరావు గౌడ్, శంకర్ నాయక్, రాస వెంకట్, వేల్పుల కుమార్, తెయూ సంఘం అధికార ప్రతినిధి బట్టు సురేశ్, రవి నాయక్, బీకోజీ, స్వప్న, ఎల్లన్న, అంజిబాబు, ప్రశాంత్, సంపత్, జగన్, సంజయ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


