ఆర్మూర్: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయల్లో విద్యార్థినులను ఆరో తరగతి నుంచే నీట్, జేఈఈ, ఎప్‌సెట్, క్లాట్ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయనున్నారు. యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ (వైఐఐఏఈ)లుగా జిల్లాలో మొత్తం 27 కేజీబీలు ఉండగా, నిజామాబాద్ (మోపాల్), మాక్లూర్, డిచ్‌పల్లి కేజీబీవీలను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే వైఐఐఏఈల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి 272 మంది ఐదో తరగతి పూర్తి చేసుకున్న బాలికలు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ప్రతిభ ఆధారంగా విద్యార్థినులను ఎంపిక చేయనున్నారు. ప్రతి తరగతి గదిలో 20 మంది విద్యార్థినులు మాత్రమే ఉండేలా చిన్న బ్యాచ్‌లుగా విభజించారు. బోధన కోసం నిష్ణాతులైన, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను ప్రత్యేకంగా నియమించనున్నారు. ఈ విద్యా సంవత్సరం నుండే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చివరి దశకు చేరుకున్నాయి.
జిల్లా విద్యాశాఖ అధికారులు ఇచ్చిన సమాచా రం ప్రకారం నిజామాబాద్ (మోపాల్) కేజీబీవీలో సీఈసీ గ్రూప్ విద్యార్థినులకు క్లాట్ (సీఎల్‌ఏటీ), మాక్లూర్ కేజీబీవీలో బైపీసీ గ్రూప్ విద్యార్థినులకు నీట్ (ఎన్‌ఈఈటీ), డిచ్‌పల్లి కేజీబీవీలో ఎంపీసీ గ్రూప్ విద్యార్థినులకు జేఈఈ మెయిన్స్ (ఐఐటీ) ప్రవేశ పరీక్ష కోసం ఆరోగ తరగతి నుంచే సన్నద్ధం చేయనున్నారు.
ఆరో తరగతి నుంచే నీట్, జేఈఈ, ఎప్‌సెట్, క్లాట్‌కు సన్నద్ధత
జిల్లాలో మూడు కేజీబీవీల ఎంపిక.. ప్రవేశ పరీక్ష పూర్తి
ప్రతిభ ఆధారంగా విద్యార్థినుల ఎంపిక


