● కామారెడ్డిలో మహిళ హత్య
కేసులో నిందితుడి అరెస్ట్
● వివరాలు వెల్లడించిన డీఎస్పీ మధుసూదన్
కామారెడ్డి క్రైం: హత్య, దోపిడీ కేసుల్లో జైలులో వెళ్లి, బెయిల్‌పై బయటకు రావడమే కాకుండా పేరు మార్చుకుని తిరుగుతూ మరో హత్యకు పాల్పడిన ఓ నిందితుడిని కామారెడ్డి పోలీసులు శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కామారెడ్డి సబ్ డివిజన్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మధుసూదన్ వివరాలు వెల్లడించారు. మాచారెడ్డి మండలం పోతారం గ్రామానికి చెందిన నర్సాపురం రాజం అనే వ్యక్తి తన భార్య శ్యామలతో కలిసి కూలీ పనులు చేసేవారు. గత నెల 31న వారు పని కోసం కామారెడ్డిలోని కూలీల అడ్డాకు వచ్చారు. రాజంకు మాత్రమే పని లభించగా, శ్యామలకు పని దొరకలేదు. దీంతో కూరగాయలు కొనుక్కొని ఇంటికి వెళ్లమని భార్యతో చెప్పి రాజం పనికి పోయాడు. రాత్రయినా భార్య ఇంటికి రాకపోవడంతో చాలాచోట్ల గాలించాడు. ఆచూకీ లభించకపోవడంతో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మూడు రోజుల తర్వాత రైల్వే ట్రాక్ పక్కన శ్యామల మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో గుర్తించారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలు, విశ్వసనీయ సమాచారం మేరకు కూలీల అడ్డాలో కొంతకాలంగా ఉంటున్న నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం శిరాన్‌పల్లి గ్రామానికి చెందిన పిట్టల నర్సింలును అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టగా శ్యామలను హత్య చేసినట్లు అంగీకరించాడు. కూలీ పనులకు వెళ్లేచోట శ్యామలతో నర్సింలుకు పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా శ్యామల మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండటంతో నర్సింలు అసూయ పెంచుకున్నాడు. ఈక్రమంలో హత్య రోజు ఆమెను రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లాడు. అక్కడ మద్యం సేవించాక వాగ్వాదం జరగడంతో రాయితో శ్యామల తలపై బలంగా కొట్టి హత్య చేశాడు. నిందితుడిపై గతంలో నిజామాబాద్ 4వ టౌన్‌లో ఒక దోపిడీ కేసు, బాసర పీఎస్‌లో హత్య కేసు నమోదై ఉన్నాయి. ఆయా కేసుల్లో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చి, మామిడి రాజన్నగా పేరు మార్చుకుని కామారెడ్డి కూలీ అడ్డాలో మకాం వేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు చేధనలో విశేషంగా కృషి చేసిన పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి, సిబ్బందిని అభినందించారు.


