గాదేపల్లి జీపీ తీర్మానం
డొంకేశ్వర్(ఆర్మూర్): గ్రామ శివారు ప్రాంతాల్లోని ఆలయాల ఆధ్యాత్మిక పవిత్రతను కాపాడడంతోపాటు పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా డొంకేశ్వర్ మండలంలోని గాదేపల్లి గ్రామ పంచాయతీ రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈమేరకు నిబంధనలతో కూడిన హెచ్చరిక బోర్డులను గ్రామంలో, ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ తీరంలో ఏర్పాటు చేసింది. పర్యాటకులు బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ప్లాస్టిక్ వ్యర్థాలు, తాగి పడేసిన మద్యం సిసాలతో కలుషితం చేస్తున్నారని ’పర్యాటకం సరే.. పారిశుద్ధ్యం సంగతేంటి’ అనే కథనాన్ని ఈ నెల 16న ‘సాక్షి’లో ప్రచురించింది. ఇందుకు గాదేపల్లి సర్పంచ్ గడ్డం చిన్నారెడ్డి స్పందించి పోస్టర్లను తయారు చేయించారు. బ్యాక్ వాటర్ వద్ద గల రామలింగేశ్వర స్వామి (శివాలయం) ఆలయం, హనుమాన్ ఆలయాల ప్రాంగణంలో పర్యాటకులు మద్యం సేవించడం, మాంసాహారం తినడంపై నిషేధం విధించింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే వారికి రూ.10వేల జరిమానా విధించనున్నట్లు జీపీ హెచ్చరిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే బ్యాక్ వాటర్ పచ్చిక బయళ్లలో పర్యాటకులు తమ ప్లాస్టిక్ వ్యర్థాలను, బాటిళ్లను ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదని సూచించింది. వీటివల్ల మూగజీవాలతోపాటు తోటి పర్యాటకులకు కూడా ఇబ్బంది కలుగుతుందన్నారు. కాబట్టి ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం బాటిళ్లను తిరిగి వెంట తీసుకెళ్లాలని పర్యాటకులకు సర్పంచ్ విజ్ఞప్తి చేశారు.


