నిజామాబాద్ అర్బన్: ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. రక్షిత మంచినీటి సరఫరా, వాతావరణ పరిస్థితులు, సీజనల్ వ్యాధులు, ప్రజాపాలన తదితర అంశాలపై గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పై అంశాలకు సంబంధించి నెలకొన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ సంబంధిత జిల్లా అధికారులతో సమావేశమై కీలక సూచనలు చేశారు. ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితుల్లో వరి సాగు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని రైతులు ప్రత్యామ్నాయంగా కంది, సజ్జ, కొర్రలు, కూరగాయలు వంటి పంటలు పండించేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వీసీలో అదనపు కలెక్టర్ భుజంగరావు, ట్రెయినీ కలెక్టర్ సురేశ్, అధికారులు పాల్గొన్నారు.
విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపర్చాలి
నందిపేట్: కేజీబీవీలో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరచడంతో పాటు విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలు నాణ్యతతో అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులు, ఉపాధ్యాయులను ఆదేశించారు. నందిపేట మండల కేంద్రంలోని కేజీబీవీని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణ, విద్యాబోధన, వసతి, భోజన ఏర్పాట్లు విద్యార్థినులకు అందుతున్న సౌకర్యాలను సమగ్రంగా పరిశీలించారు. కేజీబీవీలోని 7వ తరగతి గదికి వెళ్లి విద్యార్థి నులతో మాట్లాడారు. పలు ప్రశ్నలు వేసి విద్యార్థినుల అభ్యాసన సామర్థ్యాన్ని అంచనా వేశారు. అనంతరం విద్యార్థినులకు చాక్లెట్లు, బహుమతులను అందజేశారు. ఎంపీడీవో శ్రీనివాసరావు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ శాంతికుమారి ఉన్నారు.
తహసీల్దార్, సిబ్బందిపై ఆగ్రహం
ప్రభుత్వ స్థలాలు, అసైన్డ్ భూములు కబ్జాకు, అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులదేనని కలెక్టర్ అన్నారు. నందిపేట తహసీల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. లోపాలను గుర్తించి తహసీల్దార్, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినా, అక్రమాలకు తావు కల్పించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియ ఉన్నారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి


