● బీఆర్‌ఎస్‌కు భవిష్యత్తు లేదు
● జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు
కాటిపల్లి నగేశ్‌రెడ్డి
నిజామాబాద్ రూరల్: ప్రజల్లో తన ఉనికిని కాపాడుకోడానికి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి దొంగ నిరాహార దీక్ష చేస్తున్నాడని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాటిపల్లి నగేశ్‌రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని కాంగ్రెస్ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2022లో భీంగల్ పట్టణంలో రూ. 35 కోట్లతో వంద పడకల ఆస్పత్రికి ఫౌండేషన్ వేసినప్పుడు మూడు నెలల్లో నిర్మిస్తామని చెప్పి 18 మాసాలు నత్త నడకన సాగించి చివరకు రూ. 17 కోట్ల పనులు మాత్రమే చేశారన్నారు. అలాగే భీంగల్‌లో రోడ్ల నిర్మాణానికి రూ. 25 కోట్లు మంజూరు కాగా రూ. 17 కోట్ల మేరకే పనులు జరిగాయన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో మంత్రిగా పని చేసిన ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్‌లో నూతన సచివాలయ నిర్మాణానికి రూ. 500 కోట్లు అంచనా పెట్టుకొని మరో రూ. 500 కోట్లు అదనంగా మంజూరు చేయించుకొని ప్రజాధనాన్ని కొల్లగొట్టారని అన్నారు. తొమ్మిది మాసాల్లో నిర్మించిన సచివాలయాన్ని, నియోజకవర్గంలోని అభివృద్ధి పనులను ఎందుకు పూర్తి చేయాలని ఆయన ప్రశ్నించారు. పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండి పడ్డారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచిప్ప 20, 21 ప్యాకేజ్ పనులకు గతంలో మంత్రిగా ఉన్న సుదర్శన్‌రెడ్డి రూ.9వేల500 కోట్లు ఖర్చు చేశారని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టును రైతులకు ఉపయోగం లేకుండా చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రత్నాకర్ గౌడ్, గాదరి గోపి, కోశాధికారి భక్త వత్సలం, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి, జావీద్ అక్రం, లింగన్న, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, బాల నర్సయ్య, ర వి, గణేశ్, పూర్ణ చందర్, కిష్టా గౌడ్ పాల్గొన్నారు.


